365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 15,2022: తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువస్తూ ఒకేసారి రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని కొనియాడారు గడల.
ముఖ్యంగా ముప్పై ఏళ్ళక్రితం కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన తాను వైద్య విద్య చదువుకోవడానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైద్రాబాద్ కు రావడానికి అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నకారణంగానే ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు సాగడం సాధ్యపడిందని తెలిపారు.
మారుమూల గిరిజన యువత అధికంగా ఉండే భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో కార్పొరేట్ వైద్య కళాశాలకు ధీటుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల తరపున తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ జాతిపితగా సుపరిపాలనతో చరిత్ర సృష్టిస్తున్న సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి గడల శ్రీనివాసరావు ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణాలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు చేస్తున్న కృషిని అభినందిస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు మనసుతో ఆశీర్వదించారు.