365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 28,2022: స్పెషల్ టూర్ ప్యాకేజీతో టీఎస్‌ఆర్టీసీ “సింగరేణి దర్శన్” ను ప్రారంభించింది. ఈ సందర్భంగా “సింగరేణి దర్శన్” బస్సును సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనర్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
మంగళవారం బస్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..ఈ సేవల్ని చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నామన్నారు.
నగర అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కోసం టీఎస్‌ఆర్టీసీ గత కొన్ని నెలల క్రితం “హైదరాబాద్ దర్శన్” సేవల్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే, భక్తుల కోసం తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శన భాగ్యాన్నికూడా కల్పించే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఏడు రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవల్సి ఉంటుందన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సింగరేణి దర్శన్ పేరుతో సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.
నల్ల బంగారం గనులను ఎంచక్కగా తిలకించే అవకాశం ప్రజల సౌకర్యార్థం టి.ఎస్.ఆర్.టి.సి సింగరేణి సందర్శనంకోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దశాబ్ధ కాలానికి పైగా సిరులు కురిపిస్తున్న బొగ్గు గనుల్లోంచి బొగ్గును ఎలా తీస్తారో ప్రత్యక్షంగా తెలసుకోవాలని కుతూహలంగా ఉండే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో కాళేశ్వరం దేవాలయంతో పాటు బ్యారేజీని తిలకించేందుకు మరో టూర్ ప్యాకేజీ ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీసజ్జనర్ మాట్లాడుతూ..ఈ ప్యాకేజీ కింద ఒకరికి రూ.1600గా నిర్ణయించినట్లు తెలుపుతూ బొగ్గు గనుల తవ్వే విధానాన్ని ప్రత్యక్ష్యంగా పరిశీలించవచ్చని ఆయన వివరించారు.
ప్రజల ఆదరణను బట్టీ సింగరేణి దర్శన్ సర్వీసులను పెంచడం జరుగుతుందని, ఆదాయాన్ని పెంచుకునే దిశగా టీఎస్‌ఆర్టీసీ అడుగులు వేస్తోందని స్ఫష్టం చేశారు.
సింగరేణి దర్శన్, హైదరాబాద్ దర్శన్ సేవల్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు.
సింగరేణి డైరెక్టర్ బాల్‌రాం మాట్లాడుతూ..ఎంతో చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలను నేరుగా చూసి ఆనందించే విధంగా ఈ ప్యాకేజీని రూపొందించడం జరిగిందన్నారు.
భూగర్భగని, ధర్మల్ ప్లాంట్ లను తిలకించవచ్చని, ప్రయాణంతో పాటు శాఖాహార భోజనాన్ని కూడా కల్పించడంతో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
టీఎస్‌ఆర్టీసీ ప్రయాణీకుల సౌకర్యాల వైపు ఆలోచిస్తూ కొత్త కొత్త పంథాలో కార్యాచరణ దిశగా అడుగులు వేయడం గొప్ప విషయమన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో హన్సా ఈక్విటీ పాట్నర్స్, ఎల్.ఎల్.పి త్రినాథ్బాబు, సునీల్ రేగుల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మునిశేఖర్, వినోద్, పురుషోత్తం, యాదగిరి, వెంకటేశ్వర్లు, సి.పి.ఎం కృష్ణకాంత్, సి.టి.ఎంజీవన్ ప్రసాద్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజయకుమార్, కరీంనగర్ ఆర్.ఎం ఖుష్రో షా ఖాన్ , సి.ఎస్.ఒ విప్లవ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సినిమా కష్టాల్లో..డ్రైవర్లు,రైడర్లు.. ఇండియా రేటింగ్స్ నివేదికలో వెల్లడి..
దుర్గగుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
2022 సంవత్సరంలో బాగా పాపులర్ ఐన యోగా ట్రెండ్స్..ఇవే..!
ఇంద్రకీలాద్రి దేవస్దానము క్యాలండర్-2023 ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ..
మహిళను అతికిరాతకంగా చంపిన బస్ కండక్టర్..
అందరికీ సమానహక్కులు..సమాన గౌరవం రావాలి : మంత్రి నిరంజన్ రెడ్డి