Sun. Sep 15th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 24,హైదరాబాద్: వంటింటికే పరిమితమవుతున్న మహిళలు అన్ని రంగాల్లో వారి తెగువ చూపిస్తున్నారు. పురుషాధిక్యం ఉన్న రంగాల్లో సైతం తమ సత్తా చాటి అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు ‘పురుషులు-మహిళల పనితీరుపై’ అధ్యయనం చేశాయి. ఈ సర్వేలో అన్ని అంశాల్లోనూ మహిళలే ముందున్నారు.

ఏదైనా సమస్య వస్తే సులువుగా పరిష్కరించే ఆలోచనా శక్తి మహిళలకే ఎక్కువగా ఉన్నదట. ఒత్తిడిని తట్టుకొని నిర్మాణాత్మకంగా పనిచేయగలిగే సామర్థ్యాలు అతివలకే ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ స్టడీలో ఒత్తిడిని తట్టుకొని, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోగల సత్తా పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తెలివితేటల్లో మగవారి కంటే స్త్రీలే ముందున్నట్లు ‘యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా’ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఏదైనా సమస్య వస్తే కన్నీరు కార్చినా దానిని అవలీలగా పరిష్కరించగలుగుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కార్టిసాల్‌, ఎపినెఫ్రిన్‌, ఆక్సిటోసిన్‌ వంటి మూడు రకాల హార్మోన్లు మనిషిలో ఒత్తిడికి స్పందిస్తాయి. ఇలా స్పందించే సమయంలో కార్టిసాల్‌, ఎపినెఫ్రిన్‌ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల బీపీ(బ్లడ్‌ ప్లజర్‌) షుగర్‌ లెవల్స్‌ కూడా పెరిగి మరింత ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయట. ఇలాంటి సమయంలో ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు సందేశాలను గమనించి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపకరిస్తుంది. ఆక్సిటోసిన్‌ హార్మోను పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీంతో వారిలో ఉండే ఒత్తిడి సులువుగా తగ్గిపోతుంది. ఆక్సిటోసిన్‌ పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీరు ఎక్కువగా ఆందోళనకు గురవాల్సి వస్తుంది. ఈ హార్మోను ప్రభావంతోనే మహిళలు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇంటి ఖర్చులను పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారట. ఆర్థిక విభాగాల్లో కూడా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

error: Content is protected !!