Tue. Dec 10th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి12 ,హైదరాబాద్: సమాజంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.. ఈ మార్పులు కొంత వరకూ మేలు చేస్తుండగా అధిక శాతం చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ప్రధానంగా కెరీర్ ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాల్సిన యువత స్మార్ట్ ఫోన్ ల మోజులో పడి తమ వ్యక్తి గత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు పని ఒత్తిడిని ఎదుర్కొనలేక వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు.  ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు లోని కారైకుడి ప్రాంతంలోని వేలంగుడికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై.. కార్తికేయన్ లు అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశారు.

భారత దేశం.. నేపాల్ లలోని ప్రముఖ దేవాలయాలను వీరిద్దరూ దర్శించుకుని యువతకే కాకుండా అన్ని వర్గాల వారికి ఆదర్శంగా నిలిచారు. వారి సొంత కారులో 49 రోజుల పాటు 20,800 కిలోమీటర్లు ప్రయాణం చేసి 501 దేవాలయాలను దర్శించు కున్నారు. వారి స్వగ్రామంలో ప్రారంభమైన ఈ ఇద్దరి అన్నదమ్ముల అపురూపమైన ఆధ్యాత్మిక యాత్ర అదే గ్రామంలో ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా పాండిదురై మాట్లాడుతూ తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్ర తమ జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు.

ఇప్పటి యువతలో ఆధ్యాత్మిక భావాలు తగ్గి పోయాయని.. దేశవ్యాప్తంగా తాము దేవాలయాల సందర్శన ద్వారా అనేక అంశాలను అవగాహన చేసుకున్నామని చెప్పారు దురై. దేవాలయ వ్యవస్థను.. ఆధ్యాత్మిక సంపదను… సంస్కృతి.. సంప్రదాయాలను  కాపాడుకునేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు యువత తోడ్పాటు ఎంతో అవసరం అన్నారాయన. ఇందులో భాగంగా తాము చేసిన ఆధ్యాత్మిక యాత్రకు అడుగడుగునా అపురూపమైన స్వాగతం లభించిందన్నారు.

error: Content is protected !!