Sat. Jul 27th, 2024

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి9,హైదరాబాద్: సంస్థ ఆర్థికంగా పుంజుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, టి.ఆర్‌.అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సంస్థ ఆర్థిక పరిపుష్టికై చేసిన దిశా నిర్ధేశంలో భాగంగా బుధవారం బి.హెచ్‌.ఇ.ఎల్‌ డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలో ముందుగా ఉద్యోగుల సూచనలు, సమస్యలకు సంబంధించిన ఉద్యోగుల బాక్స్‌ను పరిశీలించారు. అలాగే, డిపో సర్వీసుల ద్వారా కిలోమీటరుకు వస్తున్న ఆదాయం (ఇ.పి.కె)తో పాటు డిపోలో నష్టాలను తగ్గించుకోవడానికి గల అవకాశాలన్నింటినీ పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉద్యోగులు విన్నవించిన సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని, వారు సూచించే విషయాలను తప్పని సరిగా పరిశీలించాలని ఆదేశిస్తూ అధికారులకు, సూపర్‌వైజర్స్‌కు కొన్ని సూచనలు చేశారు. టి.ఎస్‌.ఆర్‌.టి.సి అభివృద్థి పథంలోకి తీసుకు రావడంలో ఉద్యోగులు ప్రధాన భూమిక పోషిస్తారని, సంస్థ అభ్యున్నతి కోసం సంస్థ ఇప్పటికే నిర్ధిష్ట, నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి ప్రభుత్వ సహకారంతో పాటు ఉద్యోగులు, అధికారులందరూ వారి వారి ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. సంస్థ నష్టాల నుంచి గట్టెక్కడానికి సమష్టిగా శాయశక్తులా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. డిపో లాభంలో ఉండే విధంగా చూడాలని చెబుతూ ఈ విషయంపై ఉద్యోగుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ప్రయాణీకులకు మరింత సురక్షిత ప్రయాణం అందించడం కోసం సంస్థ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందన్నారు.