Sat. May 25th, 2024

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, జనవరి 6,హైదరాబాద్: ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ, అధిక మాసాలతో కలిపి అవి ఇరవై ఆరు! వాటిలో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనది. మహావిష్ణువు దుష్టశిక్షణ కోసం అవతారాలు ధరించడం, భువికి దిగిరావడం పరిపాటి. ఆయన వైకుంఠం నుంచి నేరుగా వచ్చి దుష్టసంహారం చేసిన సందర్భాలు- పురాణ గాథల ప్రకారం రెండే రెండు.

గజేంద్రుడి మొర ఆలకించి, మొసలిపై ఆయన చక్రాయుధం ప్రయోగించిన సందర్భం ఒకటి. కృతయుగంలో మురాసుర సంహారం మరొకటి. సరాసరి వైకుంఠుడే దిగి వచ్చి ఏకాదశినాడు మురాసురుణ్ని వధించాడు కాబట్టి, ఇది ‘వైకుంఠ ఏకాదశి’ అయింది.

దేవతల సంఖ్య మూడు కోట్లు అని కొందరు అంటారు. ఆ సంఖ్య ముప్ఫై మూడు కోట్లు అని మరికొందరు చెబుతారు. దీనిపై లోకంలో రెండు అభిప్రాయాలున్నాయి. కోటి అనేది నిజానికి సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు (11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్ట వసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలు- ఇలా దైవాల మొత్తం సంఖ్య ముప్ఫై మూడు అంటుంది వేదం. సృష్టిక్రమంలో అన్నింటికీ వీరే బాధ్యులు కాబట్టి, ‘ముక్కోటి దేవతలు’ అని పురాణాలు వర్ణించాయి. వీరంతా ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి భూలోకానికి తరలివచ్చే తిథి- ధనుర్మాస ఏకాదశి! అది మార్గశిరం, పుష్యం- ఏదైనా కావచ్చు. ముక్కోటి దేవతలూ కదలి వచ్చే తిథి కాబట్టి, ముక్కోటి ఏకాదశిగా సంభావిస్తారు.
శ్రీరంగంలోని రంగనాథస్వామి కోవెల- దేశంలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి. వైకుంఠం సప్త ప్రాకారాల మధ్య ఉందని ప్రతీతి. శ్రీరంగం సైతం కావేరీ నది రెండు పాయల మధ్య, ఒక దీవిపై ఏడు ప్రాకారాల మధ్యలో ఉంది. అందుకే శ్రీరంగం ‘భూలోక వైకుంఠం’గా ప్రశస్తి పొందింది. ముక్కోటి దేవతలు అదే ఆలయం ఉత్తర ద్వారం గుండా శ్రీరంగనాథుడి దర్శనానికి వెళతారని స్థలపురాణ కథనం. ఇదే ఏకాదశి పూట వారి కైంకర్యాలకు సంకేతంగా ‘శ్రీరంగ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవాలు’ నిర్వహిస్తారు. ఆనాడు శ్రీరంగం భూలోక స్వర్గంలా కన్నులపండువగా గోచరిస్తుంది. ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దేవతార్చనకు తరలివెళ్ళే శుభ ఘడియల్లో తామూ ప్రవేశిస్తే, వారి అనుగ్రహంతో తమకూ స్వర్గవాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగా ఉత్తర ద్వారానికి ‘స్వర్గద్వారం’ అనే పేరు స్థిరపడింది. అదే ఆచారం మొత్తం వైష్ణవాలయాలన్నింటికీ వర్తించడం మొదలైంది. ఉత్తర ద్వారం లేదా స్వర్గద్వార దర్శనం- వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ ఈ ఏకాదశి ఒక్కరోజునే అమలవుతుంది కాబట్టి దీన్ని ‘స్వర్గద్వార ఏకాదశి’ గానూ అభివర్ణించారు. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఎంతో ఆరాటపడతారు. శ్రీరంగంలో దక్షిణాభిముఖుడైన స్వామిని సేవించడానికి భక్తులు ఉత్తర ముఖంగా నిలబడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశానికి అది సంకేతం. ఇన్ని రకాలుగా ప్రసిద్ధి వహించిందీ ఏకాదశి! ఉత్తర ద్వార ప్రవేశంతో స్వర్గవాసం దక్కాలన్న ఆకాంక్ష భక్తుల్లో ఉంటుంది. అందుకే తెల్లవారకముందే బారులు తీరుతుంటారు.
ఎన్నో
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.