Mon. Sep 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఫిబ్రవరి 14, 2020, కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ పుణ్యస్థలి వద్ద, కనుచూపు మేర జలనిదిగా మారిన ప్రాణహిత గోదావరి గంగ పవిత్ర జలాలను తల మీద చల్లుకొని నాణాలు వదిలి పుష్పాంజలి ఘటించి పూజలు చేసి జల నీరాజనాలు అర్పించుకున్నారు.

లక్ష్మీ బ్యారేజ్ మీద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్న ముఖ్యమంత్రి వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉదృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఇఎన్‌సీలు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు.,ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే సహా అక్కడ హాజరైన పలువురు ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసి ఇటీవల ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నూతన బాధ్యతలు స్వీకరించిన రజత్ కుమార్ కు సంభందిత విషయాల పట్ల అవగాహన పెరిగే విధంగా ప్రాజెక్టు నిర్మాణము, సాగునీటి వినియోగం ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసుకుంటూ రిజర్వాయర్ లను నింపుతూ గోదావరి జలాలు వృధా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్ లదే అన్నారు. SRSP నుంచి మొదలుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను, రిజర్వాయర్ లను ఎత్తిపోతల పంపులను, కాల్వలను చివరాఖరి ఆయకట్టు దాకా సాగునీరు వ్యవసాయ భూములను తడిపే చివరి జల ప్రయాణం దాకా సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకుని అవసరమైతే పోలీసుల మాదిరి వైర్ లెస్ వాకీ టాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పనిచేయాలని చెప్పారు. సమాచారాన్ని ప్రతిక్షణం చెరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తుంది ఏ పంపు పోస్తుంది ఎన్నినీళ్లు ఎత్తాలే ఎప్పుడు ఆపాలే ఎప్పుడు నీటిని కిందికి వదులాలే వంటి పలువిధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాల పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలన్నారు. అట్లా సమన్వయంతో పనిచేసి గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగపరుచుకొగలమని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం మెడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజనం చేసి కరీంనగర్ బయలుదేరారు.

ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, ఇరిగేషన్ శాఖ ఇఎన్‌సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఇఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు, మున్సిపల్ చైర్మన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!