Tue. Dec 10th, 2024

365 తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 16, హైదరాబాద్:  బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తున్న వేళ‌.. ప్ర‌స్తుతం `దేవినేని` (బెజవాడ సింహం) చిత్రం హాట్ టాపిక్. 80ల‌లో బెజ‌వాడ‌లో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఇరువురు ఉద్ధండులైన రాజ‌కీయ నాయ‌కులు దేవినేని- వంగ‌వీటి రంగాల క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల వాస్త‌వ క‌థ‌ని రియలిస్టిక్‌గా తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు శివనాగు. ఈ చిత్రంలో దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా వంగవీటి రంగా పాత్రలో సంతోషం ఎడిటర్ సురేష్ కొండేటి న‌టిస్తున్నారు. ఇదివ‌ర‌కూ రిలీజైన దేవినేని లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. అలాగే ఇటీవ‌లే రిలీజైన‌ వంగ‌వీటి రంగా లుక్ లో సురేష్ కొండేటి యాప్ట్ అంటూ ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంసించారు. 

తాజాగా ఈ సినిమాలో మరో కీల‌క పాత్ర‌ధారి అయిన వంగ‌వీటి రంగా భార్య ర‌త్న‌కుమారి లుక్ కూడా రిలీజైంది. రత్నకుమారి (రంగా భార్య) పాత్రలో తమిళనటి ధృవతార నటన అద్భుతమని ఆమె హావభావాలు అమోఘమని దర్శక నిర్మాతలు చెప్పారు. తాజాగా రివీల్ చేసిన ఫోటోలో రంగాతో స‌తీమ‌ణి ర‌త్న‌కుమారి అన్యోన్య‌త‌ను ఎలివేట్ చేశారు. బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఎదురేలేని నాయ‌కుడిగా పేరున్న రంగాకు నిరంత‌రం ఎన్నో స‌వాళ్లు ఎదుర‌య్యేవి. అలాంటి స‌మ‌యంలో ఎంతో ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కొన్న గొప్ప భార్య‌గా ర‌త్న‌కుమారి గురించి చ‌రిత్ర చెబుతోంది. ఆస‌క్తిక‌రంగా రంగా కాపునేత‌గా పేరు బ‌డినా త‌న ప్ర‌త్య‌ర్థి సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌త్న‌కుమారిని పెళ్లాడి కులం అడ్డుగోడ కాద‌ని నిరూపించారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచిన వంగ‌వీటి అంద‌రివాడ‌య్యారు. అందుకే చ‌రిత్ర‌లోనూ నిలిచారు. ఇప్ప‌టికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మెజారిటీ పార్ట్ పూర్త‌యింది. మ‌రో రెండు షెడ్యూల్స్‌తో ఈ చిత్రం పూర్తవుతుందని నిర్మాత‌లు తెలిపారు.

error: Content is protected !!