Sat. Jul 27th, 2024

ప్రజా రవాణలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణలో ప్రథమ పురస్కారం

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 1,హైదరాబాద్: అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు) ప్రతిఏట ప్రామాణికంగా ఎంపిక చేసే ప్రతిష్టాత్మక అవార్డులో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో మారు తన ప్రస్థానాన్ని చాటుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో టి.ఎస్‌.ఆర్టీసీ పలు అవార్డులను కైవసం చేసుకుని సంస్థఖ్యాతినిమరింతఇనుమడింపజేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రజా రవాణా వ్యవస్థలో..ఎలక్ట్రిక్‌ బస్సుల వాడకం, నిర్వహణ విభాగంలో సంస్థకు ప్రథమ అవార్డును దక్కించుకుని ముందు వరుసలో నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాయు కాలుష్య నివారణకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్‌ బస్సులను వినియోగిస్తున్నందుకు టి.ఎస్‌.ఆర్‌.టి.సికి ఈ పురుస్కారం లభించింది. శుక్రవారం ఢిల్లీలో ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు నిర్వహణలో ప్రజా రవాణాలో ఆవిష్కరణలపై జరిగిన అంతర్జాతీయ సమావేశం, ప్రదర్శన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇంజనీరింగ్‌) వినోద్‌ కుమార్‌ సంస్థ తరఫున నగదు పురస్కారం స్వీకరించారు. భారత ప్రభుత్వ రవాణా, రహదారుల శాఖా సహాయ మంత్రి విజయ్‌ కుమార్‌ సింగ్‌ నిర్వాహకుల తరపున అందజేశారు. 64 ప్రజా రవాణా సంస్థలలో టి.ఎస్‌.ఆర్టీసీకి ఈ కేటగిరీలో అవార్డు దక్కడం చెప్పుకోదగ్గ విషయం. వాయు కాలుష్యం నివారించడంలో సంస్థ కూడా తనవంతు పాత్రను పోషిస్తోందని, పర్యావరణ హితంతో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని, ఈ విభాగంలో సంస్థకు పురస్కారం లభించడం సంతోషదాయకంగా ఉందని ఇ.డి(ఇ) వినోద్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. పురస్కార ప్రధానోత్సవంలో సీకింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ యుగందర్‌ కూడా ఉన్నారు.