365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి18,హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళన సమావేశం జరిగింది..తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు..
రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, అర్థం చెప్పి కార్యోన్ముఖులను చేశారు. ‘‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివి. బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి.అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాము. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయాము. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు.
అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేసాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహనతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా… ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి, అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదు. అది మీ చేతుల్లో ఉంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.‘‘ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకునిపోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయి.
ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనుగు లక్ష్మణకవి రాసిన పద్యాన్ని చదివారు. మేయర్ల, చైర్ పర్సన్లు, అధికారులు అనుకున్న లక్ష్యం సాధించి, ఉత్తములుగా నిలవాలని ఆకాంక్షించారు.