Mon. Sep 9th, 2024

 365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 29,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన కాళ్లపై తాను నిలబడే స్థాయికి ఆదాయాన్ని పెంచుకునే దిశలో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాల్ని ఇస్తున్నాయని, రాబోయే రోజుల్లో టి.ఎస్‌.ఆర్‌.టి.సి మరింత మెరుగైన సేవలతో కొత్త ఒరవడితో నూతన సంస్కరణలు అమలులోకి రానున్నాయని రవాణా శాఖా మంత్రి  పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో ఆధునీకరించిన మంత్రి కార్యనిర్వాహణ నూతన కార్యాలయాన్ని బుధవారం టి.ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి, టి.ఎస్‌.ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌, రవాణా శాఖ కమిషనర్‌  సందీప్‌ సుల్తానియాతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టి.ఎస్‌.ఆర్టీసీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశించిన స్థాయిలో సంస్థ అభ్యున్నతి కోసం  ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కృషి చేయడంతోనే ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. గత మాసంలో ప్రభుత్వం నుంచి నిధులు కోరకుండానే సంస్థకు వచ్చిన ఆదాయంతోనే ఉద్యోగుల వేతనాలను చెల్లించడం మంచి పరిణామమన్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందని స్ఫష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు సంస్థకు ఎప్పుడూ ఉంటాయన్నారు. టిక్కెటేతర ఆదాయం కోసం కార్గో పార్సిల్‌ సర్వీసు సేవల్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని,  50 కార్గో బస్సులు తయ్యారయ్యాయని, వీటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.  ఉద్యోగులు బోనస్‌ తీసుకునే స్థాయికి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.16.85 కోట్లు ఆదాయం వచ్చిందని, ఇది రోజు వారీ ఆదాయంతో పోలిస్తే రూ.6 కోట్ల ఆదాయం అదనంగా రావడం సంతోషదాయకమంటూ ఇది అందరి కృషి ఫలితమేనని అభినందించారు. ఉద్యోగులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వెల్‌ఫేర్‌ బోర్డు కమిటీని కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించినట్లు తెలిపారు.

డిపోలలో ఎలాంటి వత్తిళ్లు ఎదుర్కోంటున్నా, సమస్యల్ని  పరిష్కారించని పక్షంలో ఉద్యోగులు నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటిని 24 గంటల్లోగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు మార్చి 31 లోపు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వెళ్లే ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా 4వేల బస్సుల్ని అందుబాటులో ఉంచడం జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు పర్యవేక్షించనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్‌ కుమార్‌,యాదగిరి, టి.వి.రావు, వెంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

రవాణా శాఖలో ఈ బిడ్డింగ్‌ విధానంతో పారదర్శక సేవలు – మంత్రి

మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రవాణా శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ క్రమంలోనే ఈ బిడ్డింగ్‌ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు రవాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచడానికి ఈ బిడ్డింగ్‌ విధానం అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు.  దరఖాస్తుదారులు కార్యాలయానికి రాకుండానే ఫాన్సీ నెంబర్ల రిజర్వేషన్‌ కోసం ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా  ఉంటుందన్నారు. ఫాన్సీ నెంబర్ల పోటీని దృష్టిని పెట్టుకుని రూపొందించిన ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందని, రవాణా శాఖలో అనేక సంస్కరణల్ని అమలు చేస్తూ వేగవంతమైన సేవల్ని అందించడం జరుగుతోందన్నారు. రవాణా శాఖలో ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లెర్నింగ్‌ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను కూడా సరళతరం చేయనున్నట్లు వెల్లడించారు.వాహనాల కొనుగోలు తగ్గడంతో రవాణా శాఖ గ్రోత్‌ రేటు తగ్గిపోయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం 3.02 శాతం మెరుగుదల ఉందన్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్లు పాండురంగ నాయక్‌, రమేశ్‌, శ్రీమతి మమతా ప్రసాద్‌, తదితర ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం

    రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. స్వీయ అవగాహనతో నిబంధనల్ని పాటిస్తే ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయని, అతివేగం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్‌, సీటు బెల్టు ధరించకపోవడం వంటి కారణాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.

error: Content is protected !!