365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 20,హైదరాబాద్: బొమ్మలు ఎవరైనా వేస్తారు. కానీ వాటితో భావాలు పలికించినప్పుడు మనసును దోచేస్తాయి. కళారంగంలో విశిష్టతే అదే. ఊహకు ప్రతిరూపం ఇచ్చి చూపరుల మనసు దోచేయడమే కళాకారుల నైపుణ్యం. ఇలాంటి కళాకృతులనే సృష్టించి అందరినీ అబ్బుర పరుస్తున్నది హైదరాబాద్‌కు చెందిన యువతి సుష్మిత మన్నె.
మైక్రో ఆర్ట్స్, పేపర్ ఆర్స్ట్, డ్రాయింగ్, డూడుల్స్ తయారు చేస్తు పేరు సాధిస్తున్నది. ఆమె చేసిన మైక్రో ఆర్ట్స్ తో రికార్డులనే సృష్టించింది. దీంతో పాటు ప్రముఖుల అభినందనలూ అందుకుంటున్నది. ఆమె కళాకృతులు చూస్తే మీరు వావ్ అనక మానరు.
తరగతి గదిలో చివరి బెంచీలో కూర్చుంటే ఎందుకు పనికిరారని తిట్టి పోస్తుంటారు పెద్దలు. కానీ ఆ అల్లరిలోనే ఎంతో ప్రతిభ దాగుందనేది మహానుభావుల మాట. అందరి విషయంలో ఏమో కానీ సుస్మిత విషయంలో మాత్రం ఈ మాట అక్షర సత్యం అనక తప్పదు, ఎందుకంటే చదువులో యావరేజ్ స్టూడెంట్. పైగా చివరి బెంచీ. కానీ ఇప్పుడు చెప్పుకోదగ్గ మైక్రో ఆర్టిస్ట్‌గా అందరి మన్ననలను అందుకుంటున్నది. ప్రతిభకు నిజమైన కొలమానాలు ఏమీ లేవని నిరూపిస్తున్నది. స్కెచింగ్, పెయింటింగ్‌తో పాటు పేపర్ ఆర్ట్‌లోనూ ప్రతిభ చూపుతూ వాహ్ అనిపిస్తున్నది.
www.facebook.com/mannearts/
instagram.com/susmithamanne?igshid=15vfx7v1flx
తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైంది
ప్రతిరోజూ సుస్మిత చేస్తున్న చిత్రలేఖన ప్రయోగాలను చూసి తల్లిదండ్రులకు ముచ్చటేసింది. ఆమె అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు ఆర్ట్ వైపు ప్రోత్సహించారు. అడిగిన ప్రతిసారీ అవసరమైనవి కొనిచ్చారు. దీంతో సుస్మితకు మరింత ఉత్సాహం కలిగింది. పెన్సిల్ లెడ్ పై పేర్లు రాయడం, చిత్రాలు వేయడం తనకు తానుగా నేర్చుకుంది. రోజూ సుమారు 17 నుంచి 20 గంటలు మైక్రో ఆర్ట్ వేయడానికి ప్రాక్టీస్ చేసింది. ఇలా యేండ్లు గడిచే కొద్దీ తనలో నైపుణ్యం పెరుగడంతోపాటు మంచి ఫలితాలూ కపించాయి. తాను తయారు చేసిన వాటిని ఫ్రెండ్స్‌కు, బంధువులకు, తెలిసిన వారికి బహుమతిగా ఇచ్చేది. ఆత్మీయులెవరైనా అడిగితే వాళ్లకోసం అందమైన ఆర్ట్ వేసి ఇచ్చేది. ప్రస్తుతం సుస్మిత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన అభిరుచిని కొనసాగిస్తున్నది. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు ఆర్ట్ వేయడం తన మనసుకు హాయినిస్తుందని చెపుతున్నది.
శిక్షణ తీసుకోకుండానే..
డ్రాయింగ్ నేర్చుకోవడానికి టీచర్ అవసరమా? మనసుకు హత్తుకునే బొమ్మలు గీయాలంటే ఏండ్ల తరబడి శిక్షణ తీసుకోవాలా? అలాంటిదేం లేదు అంటోంది సుస్మిత. కనిపించే చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు క్వాన్వస్ మీద దించడం అదే డ్రాయింగ్. దాన్ని నిరంతరం సాధన చేస్తే పట్టు సాధించవచ్చు. నా వరకైతే ఇప్పటి వరకూ నేను ఎవరినీ అనుసరించలేదు. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసి, బొమ్మలను అర్థం చేసుకొని పని చేయడం తప్పా ప్రత్యేకమైన శిక్షణ తీసుకోలేదంటున్నది. డ్రాయింగ్ అంటే అభిరుచి, నైపుణ్యం మాత్రమే కాదు ఇది ఒక దృక్ఫథం కూడా అనేది సుస్మిత అభిప్రాయం.
ప్రతిభకు గుర్తింపు
చిన్నప్పటి నుంచి సుస్మిత మైక్రోఆర్ట్స్ వేస్తున్నా గత ఏడాది కాలంలోనే గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకూ సుమారు ఆమె మూడు వందలకు పైగా మైక్రో ఆర్ట్స్ తయారు చేసింది. ఇలా ఫైన్ ఆర్ట్స్‌లో విభిన్న ప్రతిభను గుర్తించి స్కోర్ మోర్ ఫౌండేషన్ వారు ప్రతిభా శిరోమణి అవార్డు అందించారు. దీంతో పాటు మన జాతీయ గీతాన్ని పెన్సిల్ లెడ్‌పై చెక్కి అందరి మనసూ దోచుకుంది. ప్రస్తుతం సుష్మిత స్యాండ్ ఆర్ట్ నేర్చుకుంటున్నది. అలాగే 0.5 మిల్లీమీటర్ల పెన్సిల్ లెడ్‌పై చిత్రలేఖనం చేసి హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోటీలో ఉంది.
డ్రాయింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు
డ్రాయింగ్ నేర్చుకోని వాళ్లు ఎవరూ లేరు. స్కూల్‌లో ఉన్నప్పుడు వేసిన బొమ్మలు, చాక్‌పీస్ మీద చేసే ప్రయోగాలు అన్నీ డ్రాయింగే. కానీ వయస్సు పెరిగే కొద్ది వాటిని మర్చిపోతున్నాం. పెద్దవుతూనే మనలోని చిత్రకారున్ని మర్చిపోతున్నాం. వాటినే కనుక నిరంతరం సాధన చేస్తే చేయి తిరిగిన కళాకారులుగా మారొచ్చు. ఇప్పటికీ తరగతి గదుల్లో, విసుగుతెప్పించే మీటింగ్‌లలో టైం దొరికితే పేపర్ మీద గీతలు గీయని వాళ్లు ఎవరూ లేరు! డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఎలాంటి పుస్తకాలు లేవు, ప్రత్యేక గురువులు ఎవరూ అవసరం లేదు. ప్రసిద్ది చెందిన చిత్రకారులెందరో స్వయంగా నేర్చుకున్నవాళ్లే. అదే స్ఫూర్తితో నేనూ డ్రాయింగ్, పెయింటింగ్, మైక్రో ఆర్ట్ చేస్తున్నా అంటున్నది సుస్మిత..