365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,జనవరి 6,2021:రోజువారీ కోవిడ్ మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 12 రోజులుగా రోజువారీ మరణాలు 300 లోపే నమోదవుతూ వస్తున్నాయి. ఆనవాలు పట్టటం, విరివిదా వ్యాధి నిర్థారణ పరీక్షలు జరపటం, తగిన చికిత్స అందించటం అనే బహుముఖ వ్యూహం ఫలితంగా మరణాల స్థాయి తగ్గుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రారంభ దశలోనే బాధితులను గుర్తించి ప్రామాణిక చికిత్స అందించటం వలన ఇది సాధ్యమైంది.
భారతదేశంలో గత వారం రోజులలో ప్రతి పది లక్షల జనాభాకు ఒకటి చొప్పున మాత్రమే మరణం నమోదైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల స్పందనకు, ప్రామాణిక చికిత్సావిధానాలకు ఇది నిదర్శనం.
చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ రావటం కూడా భారత్ సాధించిన మరో ఘనతగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య 2,27,546 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 2.19% కి తగ్గింది.రోజువారీ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్న నికర బాధితుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటలలో 21,314 మంది తాజాగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3,490 తగ్గటానికి ఇది కారణమైంది..
రోజూ నిర్థారణ అవుతున్న కోవిడ్ కేసులు ఈ మధ్య కాలంలో 20,000 లోపు ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో 18,088 కొత్త కేసులు వచ్చాయి.
భారత్ లో గడిచిన 7 రోజులలో ప్రతి పది లక్షల జనాభాకు 96 చొప్పున కొత్త కోవిడ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
ఇప్పటివరకు భారత్ లో కోలుకున్నవారి మొత్తం సంఖ్య కోటికి మరింత దగ్గరవుతూ నేడు 99,97,272 కు చేరింది. కొత్తగా వస్తున్న కోవిడ్ కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండగా కోలుకున్నవారి శాతం 96.36% కు చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 76.48% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. కేరళలో అత్యధికంగా 4,922 మంది గత 24 గంటలలో కోలుకోగా, మహారాష్ట్రలో 2,828 మంది, చత్తీస్ గఢ్ లో 1,651 మంది కోలుకున్నారు.
కొత్తగా నిర్థారణ జరిగిన కోవిడ్ కేసులలో 79.05% కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కేరళలో గత 24 గంటలలో 5,615 కేసులు, మహారాష్ట్రలో 3,160 కేసులు, చత్తీస్ గఢ్ లో 1,021 కేసులు వచ్చాయి..
గత 24 గంటలలో 264 మంది కోవిడ్ తో మరణించగా వారిలో 73.48% మంది కేవలం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. 24.24% (64 మరణాలు) నమోదైన మహారాష్ట మొదటి స్థానంలో ఉండగా చత్తీస్ గఢ్ లో 25 మంది, కేరళలో 24 మంది చనిపోయారు.
యుకె లో బైటపడ్ద కొత్తరకం వైరస్ సోకినట్టు భారత్ లో ఇప్పటివరకు నిర్థారణ జరిగిన వారి సంఖ్య 71 కి చేరింది.