Sun. Sep 8th, 2024

మహాశివ రాత్రి ప్రత్యేకం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఫిబ్రవరి 21,2020: “రుద్రము” లో “అధ్యవోచ దధివక్తా ప్రథమోధైవ్యో భిషక్ ” అని చెప్తారు. దేవతలకు ప్రధమవైద్యుడు , అందరికన్నా ముందుగా ( విషయాలను ) చెప్పినవాడిగా శివుణ్ణి కీర్తించడం జరిగింది. అందుకనే శివుడిని బై ( వై)ద్యనాధుడు ” అని కూడా అంటారు. శివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం , జాగరణ , శివునికి అభిషేకం , బిల్వములు , తుమ్మిపువ్వులతో అర్చనలు నిర్వహిస్తారు. జాగరణ చేయడానికి ప్రధానకారణం శివుడు ఈరోజున హాలాహలం మింగినాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని దహించివేసే హాలాహలం నిరోధించే సమర్ధత శివునికి మాత్రమే ఉన్నది. శివుడు ఆపని అప్పుడు చేయకుండా ఉన్నచో లోకమే ఉండేది కాదు. ఆనాటి శివుని సాహసానికి ఆశ్చర్యచకితులు అయిన లోకులు నాటి తీవ్ర పరిమాణాన్ని స్ఫురిస్తూ నిద్రాహారాలు మాని శివుణ్ణి ధ్యానించడమే జాగరణ , ఉపవాసాలకి సంకేతం . ఆపత్సమయాలలో అవసరం అయితే జాగరణ ( నిద్రమేల్కొనడానికి ) కావలసిన మానసిక , శారీరక అభ్యాసం ( తర్ఫీదు ) కలిగి ఉండటం సమాజానికి మంచిది కదా ! దేవునికి (ఉప) సమీపంలో , (వాసం ) ఉండడం అని కూడా ఉపవాసానికి ఉండే అర్ధాలలో ఒకటి. ఆది పర్వము ద్వితీయాశ్వాసములో హాలాహలం గురించి స్పృశిస్తారు .
ఆ గరళాన్నికంఠంలో ఉంచుకొన్నాడు
దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు.
సాగరాన్ని చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలంగా స్వీకరించమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు.


శిక్షింతు హాలహలమును
భక్షింతును మధూర సూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతు బ్రాణికోట్లను!!
గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవదం కోసం నిత్యం నెత్తి పైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు. అక్కడికీ తాపం అణగడానికి క్షీరసాగర మథనం లోనుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకొన్నాడు; గంగమ్మతల్లిని నెత్తిపైన ఉంచుకొన్నాడు. అయినా తాపం ఇబ్బంది పెడుతోనే ఉంటుందిట శివుడిని. కనుకనే, భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు.

నీయందు సంభవించును
నీయందు వసించి యుండు నిఖిల జగంబుల్
నీయంద లయము బొందును
నీయుదరము సర్వభూత నిలయము రుద్రా!!
పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నిరంతరాయంగా పనిచేసే అవయవాలలో జీర్ణాశయం ( ప్రేవులు) కూడా ఒకటి . అట్టి జీర్ణాశయానికి కొన్ని సందర్భాలలో విశ్రాంతిని ఇవ్వడం ఆరోగ్యసూత్రాలలో ఒకటి . శివుడిని పూజించేందుకు ఉపయోగించే మూలికలలో బిల్వము ( మారేడు) ద్రోణపుష్పి ( తుమ్మి) ముఖ్యమైనవి . వీటిని ఆయుర్వేదంలో విషచికిత్సలలో వాడతారు. శివుడు శ్మశానవాసి . పాములను ఆభరణంగా ధరించి , హాలాహలం మింగినవాడు. కావున విషహార ద్రవ్యాలతో , తాపాన్ని తగ్గించే అభిషేకములతో శివుణ్ణి పూజిస్తారు.

error: Content is protected !!