Sat. Dec 28th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 28,హైదరాబాద్: సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ఉద్యోగులు, అధికారులు అందరూ ఒక టీం వర్క్‌గా పని చేస్తే సంస్థ అభివృద్థిని సాధించవచ్చని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆకాంక్షించిన విధంగా టి.ఎస్‌.ఆర్‌.టి.సిని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు  చెప్పారు. శుక్రవారం జె.బి.ఎస్‌ను సందర్శించిన ఆయన అక్కడ కార్గో పార్సిల్‌ మోడల్‌ బస్సును పరిశీలించిన పిమ్మట అటు నుంచి శామీర్‌పేట బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన వన భోజన కార్యక్రమంలో పాల్గొని కార్మిక శాఖా మంత్రి శ్రీ మల్లారెడ్డి, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సునీల్‌ శర్మతో కలిసి సంస్థ పురోభివృద్ధిపై మాట్లాడారు.సంస్థలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులుగా మెలుగుతూ సంస్థ అభ్యున్నతి కోసం కృషి చేస్తే  ఉత్తమ ఫలితాలు సిద్థిస్తాయని సూచించారు. ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాల్ని పొందడానికి ముఖ్యంగా ప్రయాణీకుల ఆదరణను చూరగొనాలని చెబుతూ ఆక్యుఫెన్సీ రేషియోను పెంచుకోవడానికి ప్రయాణీకుల పట్ల మర్యాదగా మాట్లాడుతూ వారితో సాన్నిహిత్యం పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. ప్రయాణీకుల మన్ననలతో పాటు సంస్థను లాభాల బాటలోకి తీసుకురావడానికి తగు ప్రణాళికలతో అధికారులు కార్యాచరణ అమలుపరచడం జరుగుతుందని చెప్పారు.

               ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించిన విధంగా సంస్కరణలో భాగంగా సంస్థలో మంచి మార్పులు తీసుకురావడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగ భద్రత, మహిళా కండక్టర్లకు పగలు డ్యూటీలు వంటి సంక్షేమం చర్యల్ని అమలులోకి రావడం జరిగిందన్నారు. సి.ఎం. దిశా నిర్ధేశంలో సంస్థను లాభాల బాటలోకి తీసుకొస్తామనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని, ఎప్పుడైతే ఆదాయం మెరుగుపడితే వచ్చే సంవత్సరం నాటికి ఉద్యోగులు బోనస్‌ తీసుకునే విధంగా పనితీరు కనబరచాలని సూచించారు.

వన భోజన కార్యక్రమంతో నూతన ఒరవడికి నాంది

           ఆహ్లాదకరమైన వాతావరణంలో…అధికారుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ కలిసి వనభోజన కార్యక్రమంలో పాలు పంచుకోని నూతన ఒరవడికి నాంది పలికారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆధ్వర్యంలో శామీర్‌పేట బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సి.ఎం సూచించిన మేరకు ఆయా డిపోలలోనూ వనభోజన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగటం మంచి పరిణామన్నారు. ఇలాంటివి నిర్వహించుకోవడం ద్వారా ఉద్యోగుల్లో, అధికారుల్లో స్నేహపూర్వక వాతావరణం వెల్లివిరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే, నగరంలో ఛేంజ్‌ ఒవర్‌ పాయింట్లలో డ్యూటీ ఉద్యోగుల కోసం అందుబాటులోకి తెచ్చిన సంచార బయో శౌచాలయం (మొబైల్‌ బయో టాయ్‌లెట్‌)ను ఆయన మహిళా ఉద్యోగులతో కలిసి ప్రారంభించారు. టి.ఎస్‌.ఆర్టీసీకి రాబోయే రోజుల్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని, సంస్థ ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు.                                          

error: Content is protected !!