Sat. Dec 7th, 2024

సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

365తెలుగుడాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 11,2020: సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు(70) అనారోగ్యం తో కన్ను మూశారు. అస్వస్థతతో ఆదివారం వనస్థలిపురం లోని ఓ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్ లోని ఆయన స్వగృహానికి తరలించారు. పసుపులేటి రామారావు ఐడు దశాబ్దాలకు పైగా సినిమా జర్నలిస్ట్ గా సేవలందించారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి,జ్యోతి చిత్ర ,సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పనిచేశారు. పలు చిత్రాలకు పీఆర్ఓ గా వ్యవహరించారు. “ఒకే ఒక్కడు …. యశస్వీ యస్ వీ రంగారావు ” పుస్తకం ద్వారా యస్వీ రంగారావు జీవిత విశేషాలను సమగ్రంగా రాశారు. 40 ఏళ్ల దాసరి అనుభవాలతో “తెర వెనుక దాసరి” పుస్తకాన్ని తీసుకువచ్చారురామారావు. చిరంజీవి సినీ ప్రస్థానం గురించి “చిరంజీవితం150 సినీ ప్రస్థానం “అనే పుస్తకం లో వివరించారు. “అతిలోకసుందరి శ్రీదేవి కథ” ,”వెండితెర అరుణ కిరణం టి.కృష్ణ “,”వెండితెర విషాద రాగాలు “, మెగాస్టార్ “46 ఏళ్ల సినీ ప్రస్తాం లో పదనిసలు” వంటి పుస్తకాలు రాశారు.

రామారావు నా ఆత్మబంధువు… ఆ కుటుంబానికి అండగా ఉంటా

  • మెగాస్టార్ చిరంజీవి
    సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు.
    రామారావు గురించి చిరంజీవి మాటల్లోనే ‘‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక
    జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పసుపులేటి రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
“సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ పసుపులేటి రామారావు గారు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన రామారావు గారు మృదు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తన వంతు పాత్రను పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

error: Content is protected !!