ఐదు ‘ఇ‘ సమీకరణలను పాటిస్తేనే ప్రమాదాల నివారణ
ఆర్టీసీ ఉద్యోగుల భద్రతే ప్రధాన ఎజెండా -రవాణా శాఖా మంత్రి పువ్వాడ
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 1,హైదరాబాద్: కోటి మందికి పైగా ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడం టి.ఎస్.ఆర్టీసీ ఘనతగా చెప్పుకోవచ్చని, వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రతా నిబంధనల్ని తూ.చ తప్పక పాటించినట్లయితే ప్రమాదాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కళాభవన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి శ్రీ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన 31వ రోడ్డు భద్రతా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థలోని సుదీర్ఘ ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్లకు నగదు పురస్కారాలు అందజేశారు. ఇదే వేదికపై సిబ్బందితో పాటు సంబంధిత అధికారులకు పురస్కారాలు ప్రదానం చేసి అభినందించి రోడ్డు భద్రతా ప్రాధాన్యతను వివరించారు. ప్రమాద రహిత ప్రయాణానికి టి.ఎస్.ఆర్టీసీ ప్రయాణీకుల పట్ల ఎంతో నమ్మకాన్ని చూరగొన్నదన్నారు. సురక్షిత ప్రయాణంకు ఆర్టీసీ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని, సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లతో సర్వీసుల్ని నడిపించిన సమయంలో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళనతో తాను కంటి నిండా నిద్ర లేకుండా గడిపానని చెబుతూ సుశిక్షితులైన డ్రైవర్లు సంస్థలో ఉండటంతో ప్రమాదాల రేటు అత్యంత అల్పంగా నమోదై ఉండటం అభినందనీయమన్నారు. ఐదు ‘ఇ’ సమీకణలను (అంటే ఎడ్యుకేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్, ఎమర్జేన్సీ) పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, అత్యవసర సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను కాపాడడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనల్ని పాటించినప్పుడే ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించవ్చన్నారు. 2020 సంవత్సరంలో జీరో యాక్సిడెంట్ రేటు సాధించే దిశలో ఓ ఆశయంతో పని చేయాలని సూచించారు

ఉద్యోగుల సంక్షేమ బోర్డు నిర్వహణలో సమస్యల పరిష్కారం – మంత్రి
గతంలో రవాణా శాఖా మంత్రిగా పని చేసిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర ఆర్టీసీపై ఉన్న మక్కువతో సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి మార్గనిర్ధేశంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలతో పాటు సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ దిశగా సంస్థ పురోభివృద్ధి చెందితే రానున్న రోజుల్లో ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగుల సమస్కల్ని పరిష్కరించకుండా డిపో మేనేజర్లు మానసిక వేదనకు గురి చేసినట్లయితే ఉపేక్షించలేదని చెబుతూ ఉద్యోగులతో కుటుంబ సభ్యుల్లా మెలగాలని అధికారులకు సూచించారు.
ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం

– నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్
ప్రతి ఒక్కరి దినచర్యల్లో ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని, సక్సెస్ వ్యక్తుల జీవితాల వెనుక ఆర్టీసీ ప్రమేయం ఎంతో ముడిపడి ఉందని, తాను విద్యాభ్యాస సమయంలో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించిన విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గుర్తు చేస్తూ ప్రజా రవాణా సేవల్ని కొనియాడారు. బస్సుల్లోనే రియల్ కల్చర్ కనబడుతుందని, నగరంలో పోలీస్ శాఖ, ఆర్టీసీ కలిసి యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందిచడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.
ఆక్యుఫెన్సీ రేషియే పెంపు కోసం ప్రయత్నించాలి
– రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా
ప్రజా రవాణాలో ఆర్టీసీ ప్రధాన భూమిక పోషిస్తోందని, రోడ్డు భద్రతకు మారుపేరుగా సంస్థ ప్రయాణీకుల నమ్మకాన్ని చూరగొన్నదని రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. బైకుల ద్వారా ప్రయాణిస్తున్న వారిని కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా ఆదరణను పొందటానికి ప్రయత్నించి ఒ.ఆర్. శాతాన్ని పెంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రహదారుల ప్రమాదాల నివారణే థ్యేయంగా డ్రైవర్లు తమ విధి నిర్వహణ బాధ్యతల్ని పాటించాలని ఆయన సూచించారు.

ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ, మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉంటుందని, వారి పట్ల కృతజ్ఞత భావాన్ని వ్యక్త పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోడ్డు భద్రతకు సంస్థ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఈ క్రమంలో అత్యధిక కాలం ప్రమాద రహిత డ్రైవింగ్ చేసిన సిబ్బందికి డిపో, రీజియన్, జోన్ల స్థాయిలలో ముగ్గుర్ని, రాష్ట్ర స్థాయిలో ముగ్గుర్ని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహాక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడమవుతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించే దిశలో అన్ని ఆర్టీసీ డిపోలలో బ్యానర్లు, పోస్టర్లతో పాటు కరపత్రాలను ముద్రించి పంచడమే కాక సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఒ) ఇ.యాదగిరి, సి.టి.ఎం (ఎం అండ్ సి) రాజేంద్రప్రసాద్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్, తదితరులు పాల్గొన్నారు.