Thu. May 30th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 10 , హైదరాబాద్: ఆటలు మనాససిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం అనేది క్రీడల ద్వారానే కలుగుతుంది. ఆటలు గెలుపు, ఓటములపై అవగాహన కలిగిస్తాయి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. క్రీడారంగం ద్వారా ఎంతోమంది చాంపియన్లు ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆటల్లో రాణించి పుట్టిన దేశాలకే వన్నే తెచ్చారు. మన దేశంలోనూ క్రీడారంగంలో చాంపియన్లుగా రాణిస్తూ పేరు ప్రతిష్ఠలు సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి చాంపియన్లు తయారు కావాలంటే చిన్నప్పుడే అందుకు సంబంధించిన భీజాలు పడాలి. హైదరాబాద్‌లోని స్పోర్ట్ట్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌ పిల్లలకు అటువంటి భీజాలు వేస్తూ ఆటల్లో ఆణిముత్యాలను తయారుచేస్తున్నది.

క్రీడలు శరీర సౌష్టవంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సమయస్ఫూర్తి పెరగడంతోపాటు గెలుపు, ఓటములపై అవగాహన వస్తుంది. ఆత్మ స్థైర్యం పెరిగి జీవితంలో వచ్చే సవాళ్లను అధిగమించే వాతావరణం అలవడుతుంది. క్రీడల ద్వారా పేద విద్యార్థుల్లో మార్పు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు ‘స్సోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌’ (ఎసిఎఫ్‌) వ్యవస్థాపకులు కమ్మెల సాయి బాబా. ఫౌండేషన్‌ ద్వారా 300 పాఠశాలలకు చెందిన లక్షమంది నిరుపేద విద్యార్థులకు క్రీడలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

పునాది పడిందిలా….
 హైదరాబాద్‌ నగరానికి చెందిన కమ్మెల సాయిబాబా బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నిరుపేద చిన్నారులతోపాటు యువతలో క్రీడాసక్తిని పెంచేందుకు పబ్లిక్‌, ప్రైవేటు మోడల్‌ ప్రాజెక్టు కింద 1991లో రాష్ట్రప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. సాయిబాబా రంజీ ట్రోఫీ విజేత కావడంతో అప్పటి ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో కొంత భూమిని ప్రభుత్వం క్రీడామైదానం కోసం సాయిబాబాకు అప్పగించింది. అలా ‘స్సోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌’ ప్రారంభానికి అంకురార్పణ జరిగింది. పేద విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచడంతో పాటు వారిని జాతీయ, అంతర్జాతీయ చాంపియన్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. భార్య శ్రీవల్లి క్రీడాకారిణి కావడంతో ఆయన చేసే కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నది.  


క్రీడలు ఆరోగ్యాన్నందించే దివ్యౌషధం…
 క్రీడలు ఆరోగ్యాన్నందించే దివ్యౌషధంగా పనిచేస్తాయి. అందుకే ప్రపంచంలో అతి చవకైన మందుగా ఆటలను పరిగణిస్తారు. పిల్లల్లో స్పోర్ట్స్‌ కల్చర్‌ను పెంచేందుకు బిల్డ్‌ ఇండియా త్రూ స్పోర్ట్స్‌ (బిట్స్‌) పేరుతో ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థులకు ఆటలపై అవగాహన కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటుచేసి, క్రీడా సామగ్రి కూడా ఉచితంగా అందిస్తున్నారు. జైల్లో ఉండే బాల నేరస్తులు, నేరస్తుల పిల్లలు, మురికి వాడల్లో నివసించే పిల్లలు, అనాథాశ్రమాల్లో ఉండే బాధితులకు ఆటలపై ఆసక్తిని పెంచి, మానసిక ఒత్తిడి నుంచి వారిని విముక్తులను చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఢిల్లీ, గోవా వంటి రాష్ర్టాల్లోని వందల పాఠశాలల్లో క్రీడలపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రముఖ క్రీడాకారుల ఆదర్శ భావాలను….

 ప్రముఖ క్రీడాకారులు,  దేశనాయకుల జీవిత చరిత్రలను పిల్లలకు వివరిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారుల ఆదర్శ భావాలను గురించి పిల్లలకు చెబుతున్నారు. భారత క్రికెట్‌ జట్టుకు మొట్ట మొదటి కెప్టెన్‌ అయిన కల్నల్‌ కఠారి కనకయ్యనాయుడు (సి.కె.నాయుడు) పేరుతో ‘స్సోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌’ ప్లేగ్రౌండు గేట్‌ను నిర్మించారు. ఆట ఎలా ఆడాలి, అసలు ఆ క్రీడలో ఆధ్యులెవరు? ఆడే సమయంలో ఎటువంటి మెళకువలు పాటించాలనే అంశాలతో పుస్తకాలను ముద్రించి పిల్లలకు అందిస్తున్నారు. టోర్నమెంట్లు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహిస్తూ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు.  


 జాతీయ, అంతర్జాతీయ స్థాయి చాంపియన్లుగా విజయం

ఆటల్లో ఓనమాలు దిద్దిన వారిలో జాతీయ, అంతర్జాతీయ చాంపియన్లుగా విజయం సాధించారు. జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. అర్చనాదాస్‌, టి సుమన్‌, అంబటి రాయుడు వంటి వారు ఇక్కడే శిక్షణ పొందారు. ఎస్సీఎఫ్‌లో మంచి క్రమశిక్షణ ఉండడమేకాకుండా, నిపుణులైన కోచ్‌లు ఉండడంతో ప్రముఖులు, వారి పిల్లలు సైతం ఇక్కడ శిక్షణ పొందేందుకు వస్తున్నారు.


అత్యాధునిక సౌకర్యాలు
క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, కిక్‌బాక్సింగ్‌, జిమ్నాటిక్స్‌ టెన్నిస్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌ బాల్‌ వంటి అన్ని రకాల క్రీడలు ఆడేందుకు అనువుగా ఉంటుంది. అంతేకాదు నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. 15మంది విద్యార్థులకు ఓ కోచ్‌ ఉండేలా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రాక్టీస్‌ చేసేందుకు ఫ్లడ్‌లైట్లను అమర్చారు. రెండు ఎలక్ట్రానిక్‌ బౌలింగ్‌ మిషన్‌లు, డిజిటల్‌ స్పీడ్‌ గన్‌, స్పోర్ట్స్‌ ఆడియో, విజువల్‌ హాల్‌, స్పోర్ట్స్‌ లైబ్రరీ వంటి సదుపాయాలు స్టోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌లో ఉన్నాయి.


 స్టోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌ విజయాలు
భారతదేశంలోనే ‘బెస్ట్‌ స్పోర్ట్స్‌ ఎన్జీవో అవార్డు’ దక్కింది. ఈ అవార్డును 2015లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులు మీదుగా కమ్మెల సాయిబాబా అందుకున్నారు. 2016లో ప్రపంచంలోనే ఉత్తమ క్రీడా స్వచ్ఛంద సంస్థగా మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా వివిధ కెటగిరీల్లో జాతీయ స్థాయిలో 6 అవార్డులు వచ్చాయి. సమోసాలు అమ్మే పిల్లవాడిని చేరదీసి, క్రికెట్‌లో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి క్రీడాకారునిగా మార్చాడు సాయి బాబా. అటువంటి యువకుని కథను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. ఈ డాక్యుమెంటరీకి 2017లో ఇంటర్నేషనల్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ అవార్డు వచ్చింది.  

 


ప్రభుత్వ ప్రోత్సాహంతోనే…..
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇప్పటి వరకూ ముందుకెళ్లగలుగుతున్నాం. ఎక్కువ మంది పిల్లలను ఆటలవైపు ప్రోత్సహిస్తే సోదరభావం పెరగడంతోపాటు, నలుగురితో ఎలా మెలగాలో తెలుస్తుంది. చాలామందికి ఆటలంటే నిర్లక్ష్యం ఉంటుంది. ఇతర దేశాలకు ఒలంపిక్స్‌లో ఎక్కువ పతాకాలు వెళుతున్నాయంటే, అక్కడ క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అటువంటిది. చిన్నప్పటి నుంచే అక్కడి పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నది. స్పోర్ట్స్‌ ఈజ్‌ ఏ చీఫెస్ట్‌ మెడిసిన్‌ ఇన్‌ ద వరల్డ్‌ అంటారు. -కమ్మెల సాయిబాబా, స్టోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ సెక్రటరీ.