365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 29,హైదరాబాద్: హాలీవుడ్ లో దర్శకత్వం చేసే అవకాశాన్ని సంపాదించి, సర్వత్రా ప్రశంసలు పొందుతున్న మన భారతీయ తెలుగు సినీ దర్శకుడు, జగదీష్ దానేటిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్కరించారు. భారత చిత్ర పరిశ్రమ నుండి హాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేస్తున్న ప్రప్రథమ దర్శకుడిగా ప్రశంసించారు. జగదీష్ ప్రారంభించనున్న హాలీవుడ్ సినిమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఇండియా రానున్న హాలీవుడ్ దిగ్గజం జానీ మార్టిన్ మరియు పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులను హైదరాబాద్ కు ఆహ్వానించమని సూచించారు. దేశం గర్వించే ఈ ఇండో-అమెరికన్ చిత్ర ఒప్పందాల విషయాన్ని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పక ఆహ్వానిస్తారనీ, తెలంగాణ ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందనీ తెలిపారు.
విభిన్నమైన కథలతో హాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకుని భారత్ సత్తా చాటిన భారతీయ తెలుగు రచయిత, దర్శకుడు జగదీష్ దానేటి నటుడు అలీ,ఇటీవల న్యూ ఢిల్లీలో భారత ప్రసార సమాచార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ని కూడా కలిసి తమ ఇండో-హాలీవుడ్ చిత్రాల వివరాలు తెలిపారు. భారత్ లో చేయనున్న షూటింగ్ అనుమతుల విషయమై చర్చించారు.
భారతీయ సినిమా నుండి రచయిత , దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి, నేరుగా హాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం చేజిక్కించుకున్న జగదీష్ దానేటిని , నటులుగా హాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్న అలీని, మంత్రి జవదేకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఏం. నైట్ శ్యామలన్ భారతీయ సంతతికి చెందినా, అమెరికా పౌరుడిగా ఆంగ్ల చిత్రాలకు దర్శకత్వం చేపట్టారు. హాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న మొట్టమొదటి భారతీయ రచయిత-దర్శకుడిగా, జగదీష్ దానేటి నిలిచారనీ, భారత ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనీ, ప్రకాష్ జవదేకర్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ రానున్న హాలీవుడ్ దిగ్గజం, మార్టినీ ఫిలిమ్స్ అధినేత, జానీ మార్టిన్ మరియు పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులకు భారత్ ఆహ్వానం పలుకుతుందన్నారు. చిత్ర దర్శకుడు జగదీష్ దానేటి కృషిని అభినందిస్తూ, ఈ హాలీవుడ్ ప్రోజెక్టుల వివరాలు ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యేకంగా వివరించనున్నట్టు తెలిపారు.
సమావేశం అనంతరం నటులు అలీ మీడియాతో మాట్లాడుతో, ఒక తెలుగు కుర్రాడు హాలీవుడ్ లో అమెరికన్ చిత్రాలకు దర్శకత్వం వహించటమనేది గొప్ప విషయామనీ, జగదీష్ తలపెట్టిన మహా యజ్ఞంలో తనకు భాగమయ్యే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రధాని దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లటంతో పాటూ, ఇండియాలో జరగబోయే షూటింగ్ మరియు అనుమతుల విషయంలో పూర్తి సహకారం అందిస్తానన్న భారత సినిమాటోగ్రఫీ శాఖామంత్రి, ప్రకాష్ జవదేకర్ , తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి ధన్యవాదాలు తెలియజేసారు.
భారత్ కు చెందిన హాలీవుడ్ దర్శకుడు, జగదీష్ దానేటి మాట్లాడుతూ, తను రాసుకున్న కథలే తన హాలీవుడ్ ఎంట్రీకి కారణమన్నారు. భారత చిత్ర పరిశ్రమకి చెందిన ఎందరో మహానుభావులు తన ఉన్నతికి కారణమనీ, అందరికి ధన్యవాదాలన్నారు. ముఖ్యంగా మీడియా చేయూత మరువలేదన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో, భారత్ కి రానున్న హాలీవుడ్ దిగ్గజం జానీ మార్టిన్ , పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధుల సమక్షంలో ప్రోజెక్టుల వివరాలు ప్రకటించబోతున్నట్టు తెలిపారు.
కలల సౌధమైన హాలీవుడ్ లో అడుగుపెట్టిన మన రచయిత-దర్శకుడు, జగదీష్ దానేటి ద్వారా చిత్ర పరిశ్రమకు చెందిన ఇరవై నాలుగు విభాగాలలో దేశీ నటులు, నిపుణులకు తలుపులు తెరుచుకోనున్నాయి. తెలుగువాడైన అలీని ఇప్పటికే జగదీష్ ఎంపిక చేసుకోగా, ప్రముఖనటులు, నిపుణులు, రూపొందించే హాలీవుడ్ ప్రాజెక్టులలో అవకాశం కోసం, దర్శకుడు జగదీష్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మిగతా భారతీయ నటులు ఎవరని జగదీష్ ని అడుగగా, త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.