365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 28,2020: వారికి రెక్కాడితేగాని డొక్కాడదు. అయినా పదిమందికి తమవంతు సాయం చేయాలనుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కరోన కష్ట కాలంలో ఆకలితో అలమటించే వారికి నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ , కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన కొంతమంది గృహిణులు, యువకులు కలిసి చందాలు వేసుకొని వలస కార్మికులకు బియ్యం,కూరగాయలు, పప్పు, ఉప్పు, నూనె ఉచితంగా పంపిణీ చేశారు.
ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామంలో వలస కార్మీకులు తినడానికి తిండి లేక పస్తులుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నకంచికచర్లకు చెందిన లక్ష్మీశెట్టి మణికంఠ తన స్నేహితులతోపాటు సామ్రాజ్యం , లక్ష్మీశెట్టి కోటేశ్వరమ్మ ,లక్ష్మీ తదితరులు కలిసి అన్నార్తుల ఆకలి తీర్చడానికి అవసరమైన నిధులు సేకరించారు. వాటితో కూరగాయలు,నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి దొనబండ గ్రామంలోని వలస కూలీలకు అందించారు. వీరి ఔదార్యాన్ని చూ సిన ఓ వ్యక్తి వారు సేవలందిస్తున్న పోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో క్లిష్ట సమయం లో వలస కూలీలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సేవకులకు ” హ్యాట్సాఫ్ ” అంటూ వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.