365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 17,2021: కొవిడ్-19 ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం చూపింది.అయితే,దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా దారుణంగా దెబ్బతిందనిఇప్పుడిప్పుడే తెలుస్తోంది.కొవిడ్ ఉన్నవారితో పాటు,తగ్గినవారికీ ఉదర సంబంధిత సమస్యలు ఒక మాదిరి నుంచి చాలా తీవ్రంగా ఉన్నాయని లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, హెచ్‌పీబీ సర్జన్ డాక్టర్ భరత్‌కుమార్ నారా తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి…
కొవిడ్ బాధితుల్లో దాదాపు 50% మందికి వికారం, వాంతులు,విరేచనాల లాంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి జరిగిన అనేక పరిశోధనల్లో కొవిడ్-19 మానవ జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావం నిరూపితమైంది. అందువల్ల గతంలో కొవిడ్ వచ్చి తగ్గినవారు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా వైరస్ వల్ల గట్ మైక్రోబయోమ్, కాలేయం, ప్లీహం కూడా ప్రభావితం అవుతాయి. కాలేయంలోని ఎంజైములు ఎక్కువ కావడం వల్ల దాని పనితీరు దెబ్బతింటుంది. కొవిడ్ వల్లే ఈ ఎంజైములు పెరుగుతాయి. కొంతమందిలో పాంక్రియాటైటిస్ వచ్చి, చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండి, సొంత వైద్యం కాకుండా సరైన సమయానికి వైద్యులను సంప్రదించాలి.
కొవిడ్-19, దాని సంబంధిత సమస్యలతో సహా, ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కోవాలంటే సరైన ఆహారం చాలా ముఖ్యం. ప్రజలు ఈ విషయాన్ని చాలావరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌ను నియంత్రించాలంటే మంచి రోగనిరోధక శక్తి అవసరం. అది సరైన ఆహారం, పోషకాల మీదే ఆధారపడి ఉంటుంది. ఒమెగా-3, ఫాటీ ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్ల లాంటి ఫైటో కెమికల్స్, పోలీఫెనాల్స్‌తో కూడిన యాంటీఇన్‌ఫ్లమేటరీ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
పండ్లు, కాయగూరలు, కాయధాన్యాలతో పాటు తగినంత పీచుపదార్థాన్ని అందించే తృణధాన్యాలను తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ ఆహారాల్లో ఉండే, శరీరానికి మేలుచేసే సూక్ష్మజీవులు పులియబెట్టడం ద్వారా, జీవక్రియకు ఉపయోగపడే పదార్థాలను రూపొందించడం ద్వారా ఉదరంలో వాపును తగ్గిస్తాయి. అందువల్ల కరోనావైరస్ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేలా శరీరాన్ని సిద్ధం చేసేందుకు ఆహారపు అలవాట్లపై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం.