365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి 6, హైదరాబాద్ :`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణతలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం నేచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘‘ఇదుగో..మా స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శబ్దం’ ట్రైలర్. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అని చిత్ర యూనిట్‌కి నాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా లో అత్యధిక భాగం అమెరికాలో చిత్రీకరించారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమా అంతా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒక అమెరికన్ న్యూస్ రిపోర్టర్ “దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది” అన చెప్తుంది.‘అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్ చేశారంటా..కానీ ఎవరో ఏంటో కనిపించలేదంటున్నారు’ అనే డైలాగ్ లు వినిపిస్తాయి. అంజలి ఈ కేసును విచారణ చేస్తూ ఉంటుంది. “ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు” అని మరో సీన్ లో అంజలి అంటుంది. అనుష్క ను విచారిస్తూ “నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు?” అని ప్రశ్నిస్తుంది. “నిన్న ఆర్ఫనేజ్ కు వెళ్ళిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి” అంటుంది. అవసరాల శ్రీనివాస్ మరో సీన్ లో “ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?” అని అడిగితే “ఎవరో తనకి సహాయం చేస్తున్నారు” అంటూ బదులిస్తుంది.
ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న అనుష్క, మాధవన్ కొన్ని భయానకమైన విషయాలను చూస్తారని.. అసలు ఆ ఇంట్లో ఏముందోనని పోలీసులు అన్వేషణతోనే సినిమా రన్ అవుతుందని తెలుస్తుంది. మరో హీరోయిన్ అంజలి అమెరికన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడుతుంది. ఆమె అనుష్కకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అనుష్క మాటలు మాట్లాడలేని, చెవులు వినపడని బధిర అమ్మాయి సాక్షిగా ఈ సినిమాలో నటించింది. ఆమె తన సైగలతో అంజలికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. అసలు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎవరు? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే ఈ ట్రైలర్‌లో మైకేల్ హడ్సన్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, షాలిని పాండే తదితరులు కనబడతారు.
అసలు ఘోస్ట్ హౌస్ ఏంటి? అందులో జరిగే కథేంటి? అనేది తెలుసుకోవాలంటే ఏప్రిల్ 2న విడుదలవుతున్న ‘నిశ్శబ్దం’ చూడాల్సిందేనని ఆసక్తి రెపేలా ట్రైలర్ ఉంది.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో తదితరులు నటిస్తున్నారు. సంగీతం: గోపీ సుందర్,ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,ఆర్ట్: చాడ్ రాప్టోర్,స్టైలీష్ట్: నీరజ కోన,స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్,
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్