365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 1, 2025: టెక్ విద్యా రంగంలో ప్రముఖ సంస్థలైన నెక్స్ట్ వేవ్ అండ్ ఎన్ఐఏటి సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ అత్తులూరికి అరుదైన గౌరవం లభించింది.

చైనాలోని టియాన్జిన్ లో జరిగిన ‘యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది న్యూ చాంపియన్స్’ (సమ్మర్ దావోస్)కు ఆయన్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఆహ్వానించింది.

అధునాతన టెక్నాలజీలతో వేగంగా మారిపోతున్న జాబ్ మార్కెట్‌లో, ముఖ్యంగా ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలపై పడుతున్న ప్రభావం గురించి, యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై ఆయన తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు.

అంకితభావానికి, విద్యా విప్లవానికి ప్రతీక..

తెలంగాణలోని రామగుండానికి చెందిన రాహుల్ అత్తులూరి, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థి. ప్రస్తుతం దేశ విద్యా రంగాన్ని టెక్నాలజీతో మెరుగుపరుస్తున్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఆయన ఎదిగారు. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల యువతకు ప్రేరణగా నిలిచారు.

ప్రపంచ స్థాయి వేదికపై కీలక చర్చ..

స్విట్జర్లాండ్‌లోని కోలోగ్నీ వేదికగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేసే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశానికి ప్రపంచ నేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, పాలసీ రూపకర్తలు, పరిశోధకులు హాజరవుతారు.

గతంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, డోనాల్డ్ ట్రంప్, సత్య నాదెళ్ల, సుందర్ పిచై, ఎలాన్ మస్క్ లాంటి అగ్ర నాయకులు ఈ వేదికపై ప్రసంగించారు. వివిధ ప్రభుత్వాల మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఎక్స్ఓలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.

“యువత భారంగా మారకూడదు”..

“కెరీర్ పాత్\u200cవేస్ రీవైర్డ్” సెషన్‌లో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “భారతదేశ జనాభాలో 60 శాతం మంది యువతే. ఇది రెండు వైపులా పదును ఉన్న ఖడ్గం లాంటిది. వీరి ప్రతిభను చక్కటి మార్గంలో మలిచితే, ఇది ఒక పెద్ద వరం. లేదా అవకాశాన్ని వదిలేసినట్లైతే ఒక పెద్ద భారంగా మారుతుంది” అని పేర్కొన్నారు.

ఏఐ ప్రభావం: తాత్కాలిక సవాళ్లు, భారీ అవకాశాలు..
“టెక్నాలజీ మార్పుల ప్రభావం ఎప్పుడూ జే అక్షర రూపంలో ఉండే కర్వ్ లాగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న దశలో ఉన్నాం. చాలా కంపెనీలు హైరింగ్ ను ఆపేసాయి. కస్టమర్ సపోర్ట్ వంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఏఐతో పనులు వేగంగా చేసుకుంటున్నాయి” అని రాహుల్ అన్నారు.

అయితే, ఇవన్నీ తాత్కాలికంగా జరిగే మార్పులేనని ఆయన స్పష్టం చేస్తూ, “మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఏఐ స్కిల్స్ ఉన్న వారి కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. జనరేటివ్ ఏఐ వల్ల భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయి. దానికి భారత్ సిద్ధంగా ఉండాలి.

ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ పనులు వేగంగా ఆటోమేట్ అవుతున్నాయి. దీని ఫలితంగా, సంప్రదాయ ఉద్యోగ మార్గాలు మారిపోతున్నాయి.

ఇలాంటి సమయంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు కలసి పని చేయడం చాలా కీలకం. డిగ్రీలతో పాటు స్కిల్స్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. స్కిల్ క్రెడెన్షియల్స్ పై మరింత దృష్టి పెట్టాలి” అని వివరించారు.

విద్యలో ఏఐ పాత్ర, నైపుణ్యాల ప్రాధాన్యత..

విద్యలో ఏఐ పాత్ర గురించి రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “విద్యార్థులు ఏఐని ఏఐ సహాయంతోనే నేర్చుకోవాలి. కంపెనీలు తమకు కావలసిన నైపుణ్యాలను స్పష్టంగా వెల్లడించాలి. ఇలా చెయ్యడంతో విద్యార్థులు రాబోయే ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా తయారవుతారు” అని అన్నారు.

భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి, యువతకు ఏఐ యుగానికి అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు విస్తృతమైన చర్యలు చేపడుతున్నట్లు రాహుల్ అత్తులూరి వివరించారు.

యువత కేవలం ఏఐ స్కిల్స్ మాత్రమే కాకుండా, మానవతా విలువలతో కూడిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం అవసరం అన్నారు. ఏఐలో ప్రావీణ్యం సాధించి పరిశ్రమలో విలువైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

డిజిటల్ డివైడ్ నివారణకు పరిష్కారం..


“ప్రస్తుతం ఉన్న డిజిటల్ డివైడ్ ను నివారించాలంటే, విద్యలో ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు ఏఐ టూల్స్ అందుబాటులో ఉండాలి. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ చేరువలో ఉండాలి.

ప్రత్యేకంగా, నో-కోడ్ లేదా లో-కోడ్ టూల్స్ తో విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు బిల్డ్ చెయ్యాలి, ఏఐ ఏజెంట్లను ఉపయోగించాలి. ఇలా నేర్చుకోవడం వల్ల ఇండస్ట్రీలోకి ప్రవేశించే సమయానికి చక్కటి స్కిల్స్ తో సిద్ధంగా ఉంటారు” అని రాహుల్ అత్తులూరి అన్నారు.

నెక్స్ట్ వేవ్ కు అంతర్జాతీయ గుర్తింపు..


2024లో నెక్స్ట్ వేవ్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) టెక్నాలజీ పయనీర్ గా గుర్తించింది. ఈ గౌరవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేవలం 100 సంస్థలకు మాత్రమే దక్కుతుంది.

గతంలో గూగుల్, స్పోటిఫై, ఎయిర్ బీఎన్ బీ, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) లాంటి సంస్థలు ఇదే గుర్తింపు పొందాయి. తర్వాత అవన్నీ ప్రపంచాన్ని మార్చిన టెక్ కంపెనీలుగా నిలిచాయి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మర్ దావోస్ లో రాహుల్ అత్తులూరి పాల్గొనడం నెక్స్ట్ వేవ్ కు కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది.

ఏఐ ఆధారితంగా, స్థానిక భాషల్లో నేర్చుకునేలా రూపొందించిన నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫారం వినూత్న విధానం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది.