
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్ , తిరుమల, ఆగస్టు 3, 2021: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అర్చకులకు విధుల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు. యాగకర్మలు, పుణ్యాహవచనం, హోమాలు తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగిస్తారు. సాక్షాత్తు స్వామివారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. కాగా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారని చెప్పారు.