365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 19, 2025:నగరంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పరిశీలించారు.బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీ, దోమలగూడలోని గగన్‌మహల్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

శ్రీరాంనగర్ కాలనీలో కాలువ నిర్మాణం
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంనగర్ కాలనీలో 450 ఇళ్లు నీట మునిగాయని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇక్కడి నుంచి వరద నీరు హుస్సేన్‌సాగర్ నాలాలోకి వెళ్లే పైప్‌లైన్ దెబ్బతినడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.

సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించిన రంగనాథ్, హుస్సేన్‌సాగర్ నాలాను కలుపుతూ ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్త కాలువ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అలాగే, ముంపునకు గురైన నీటిని తొలగించడానికి హైడ్రా భారీ మోటార్లను ఏర్పాటు చేశారు.

దోమలగూడలోని హుస్సేన్‌సాగర్ నాలాలో పూడిక తొలగింపు
దోమలగూడలోని గగన్‌మహల్ ప్రాంతం, హుస్సేన్‌సాగర్ నాలాలో పూడిక పేరుకుపోవడం వల్లే ముంపు సమస్య తలెత్తిందని స్థానికులు వివరించారు.

ఇది కూడా చదవండి…సెన్‌హైజర్‌తో ఈ దీపావళిని జరుపుకోండి: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రత్యేక ఆఫర్‌లు..!

దీనిపై కమిషనర్ అపార్టుమెంట్లపైకి ఎక్కి నాలా ప్రవాహాన్ని పరిశీలించారు. వరద తగ్గిన వెంటనే జేసీబీలను ఉపయోగించి పూడికను తొలగిస్తామని, నాలా ఆక్రమణలను కూడా తొలగిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

అశోక్‌నగర్‌లో వరద కాలువ విస్తరణకు ఆదేశాలు
అశోక్‌నగర్‌లోని హుస్సేన్‌సాగర్ వరద కాలువను అనుసంధానం చేసే నాలాను విస్తరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలు పడినప్పుడు ఇందిరాపార్కు నుంచి వచ్చే వరద నీరు అశోక్‌నగర్ మీద పడుతోందని, అక్కడి కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల సమస్య తీవ్రమైందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

దీనితో ఒక దేవాలయం వద్ద ఉన్న రిటైనింగ్ వాల్ కూడా కూలిపోయిందని చెప్పారు. వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, నాలాను విస్తరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ఇతర అధికారులు యజ్ఞనారాయణ, గౌతమ్, రామానుజుల రెడ్డి , శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానికులు కమిషనర్ పర్యటనపై సంతోషం వ్యక్తం చేశారు.