
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 26,2021: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణలో భాగంగా గురువారం మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు జలాధివాసం జరిగాయి.

అనంతరం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేత శ్రీ రామచంద్రమూర్తి, అనంత, గరుడ, విష్వకేనులు, చక్రతాళ్వార్, పంచమూర్తుల ఉత్సవర్లకు మహా శాంతి తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శయనాధివాసం, విశేష హోమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 27న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహూతి, విమాన సంప్రోక్షణ, గోపుర సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు.