365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూన్ 25,2021 : అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడై హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.స్వామివారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించారు. హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన శ్రీ కోదండ రాముడిని దర్శించడం వల్ల భోగ భాగ్యాలు, జ్ఞానవిజ్ఞానాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం జరుగనుంది.సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు గజవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
శ్రీ చంద్ర మౌళీశ్వరస్వామివారికి పట్టు వస్త్రాల బహూకరణ
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి అప్పలాయగుంటలోని శ్రీ చంద్ర మౌళీశ్వరస్వామివారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.