365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 31, 2020:కొవిడ్-19పై పోరాటంలో ముందువరుసలో నిలిచిన యోధులు.. ముఖ్యంగా కేరళ నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన నర్సుల గౌరవార్థం ఓనమ్ పండుగను కాంటినెంటల్ ఆసుపత్రిలో నిర్వహించారు. పెద్ద మొత్తంలో పూకళం, ఓనమ్ కలైకల్‌తో పాటు ప్రత్యేకమైన ఓనమ్ సాద్య.. అంటే 20-25 రకాల వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని అరటి ఆకుల్లో వడ్డించడం ద్వారా సంప్రదాయబద్ధంగా ఈ పండుగను చేసుకున్నారు.అయితే, ప్రతి సంవత్సరంలా జరిగే సంబరాలు ఈసారి ఈ మళయాళీ పండుగలో లేవు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాపించడంతో దాని ప్రభావం ఈ పండుగపైనా పడింది. “గతంలో జరిగిన మంచిని తలుచుకోడానికి మేం ఓనమ్ పండుగ చేసుకుంటాం. మహాబలి మహారాజు సమయంలో ఉన్నట్లుగానే ఉండాలని మేమంతా కోరుకుంటాం. అప్పట్లో అందరికీ సంపద, సంతోషం, ఆరోగ్యం, ప్రేమాభిమానాలు ఉండేవి. ఈ కలను నెరవేర్చుకోడానికి బోలెడంత కష్టపడాలి” అని కాంటినెంటల్ ఆసుపత్రుల చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ కుమారి హరితా విజయన్ తెలిపారు. పూకళం లేదా పెద్ద పువ్వులతివాచీని ఏర్పాటు చేయడం ద్వారా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ ఉత్సవాలలో 200 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు.
తిరువతిర అనే సంప్రదాయ నృత్యం, ఓనపట్టుకల్ సంగీత ప్రదర్శన, ఆ తర్వాత వివిధ సంప్రదాయ ఆటలు కొనసాగాయి. సొంత ఇళ్లకు దూరంగా ఉంటూ కొవిడ్ మహమ్మారితో పోరాడుతూనే కాంటినెంటల్ ఆసుపత్రికి చెందిన మళయాళ సిబ్బంది ఈ రకంగా ఓనమ్ సంబరాలను చేసుకుని సంతోషించగలిగారు.విష్ణుమూర్తి మరుగుజ్జు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి మహాబలి మహారాజును భూమిలోకి తొక్కేస్తాడు. మళయాళ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగమ్ ప్రారంభంలో ఆ మహారాజు తిరిగి వచ్చిన సందర్భంగా ఓనమ్ పండుగ చేసుకుంటారు. మహాబలి మహారాజును పూకళం అనే పూలతివాచీతో సంప్రదాయంగా స్వాగతిస్తారు. కేరళలో పది రోజుల పాటు జరిగే ఓనమ్ సంబరాలు ఆగస్టు 22న ప్రారంభమై సెప్టెంబరు 2న ముగుస్తాయి. ప్రధాన సంబరం తిరు ఓనమ్ ఆగస్టు 31న ఉంటుంది.