Wed. Jan 15th, 2025
Gujarat-bridge

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అహ్మదాబాద్, అక్టోబర్ 31,2022: గుజరాత్‌లోని మోర్బీలో బ్రిటిష్ కాలం నాటి వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో 141మంది మరణించారు. దాదాపు 177 మందిని రక్షించగలిగారు. ఈ సంఘటనలో గల్లంతైన వారి కోసం బృందాలు వెతుకుతున్నాయి.

సుమారు 500 మందికిపైగా బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే కూలిపోయింది. మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. దీంతో కొందరు నీటి ప్రవాహంలో కొట్టుకొనిపోయారు. అహ్మదాబాద్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న150 ఏళ్ల నాటి వంతెనపై పలువురు ఛఠ్ పూజ నిర్వహిస్తున్నారు. వంతెన తెగిపోవడంతో ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలా మంది వంతెనకు అతుక్కుపోయారు.కొందరు సురక్షితంగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోగలిగారు.

Gujarat-bridge

మచ్చు నదిపై వంతెన మరమ్మతుల కోసం ఏడు నెలలుగా మూసివేశారు. మళ్ళీ గుజరాతీ నూతన సంవత్సరం అయిన అక్టోబర్ 26న ప్రజలకు తిరిగి తెరిచారు. “గత వారం పునర్నిర్మాణం జరిగింది. మేము కూడా షాక్ అయ్యాము. మేము విషయాన్ని పరిశీలిస్తున్నాము. ఈ విషాదానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది” అని గుజరాత్ కార్మిక, ఉపాధి మంత్రి బ్రిజేష్ మెర్జా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో ఉన్నారు. నిన్నటి నుంచి సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ విచారణ జరుపుతోందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.

Gujarat-bridge


శతాబ్ద కాలం నాటి బ్రిడ్జిని మరమ్మతులు చేశాక తిరిగి తెరవడానికి ముందు భద్రతా ధృవీకరణ పత్రం తీసుకోలేదని స్థానిక మున్సిపల్ బాడీ చీఫ్ సందీప్‌సిన్హ్ జాలా వెల్లండించారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఐదు బృందాలు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ, నేవీ- ఎయిర్ ఫోర్స్ టీమ్స్ కూడా రాత్రంతా సహాయక చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యాయి.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాని నరేంద్ర మోడీ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు.

error: Content is protected !!