365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 4,2025: 28°C సినిమా, ఉష్ణోగ్రతను ప్రధానాంశం గా తీసుకుని తెరకెక్కిన చిత్రం. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి ‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ..
ఓ అమ్మాయి హత్య కేసును విచారించడానికి వచ్చిన పోలీస్ అధికారి (రాజా రవీంద్ర), డాక్టర్ కార్తీక్ (నవీన్ చంద్ర) ఈ హత్యకు కారణమని అనుమానిస్తాడు. కార్తీక్ ఇంట్లో అతనికి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో కార్తీక్, డాక్టర్ అంజలి (షాలినీ వడ్నికట్టి) ప్రేమ కథ ఉంటుంది. వైజాగ్ లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న కార్తీక్, అంజలిని ప్రేమిస్తాడు.

వారు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకునే సమయంలో, అంజలి అనారోగ్యం పాలవుతుంది. ఆమె 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలదని వైద్యులు చెబుతారు. కార్తీక్ ఆమెను పెళ్లి చేసుకుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలో కార్తీక్, అంజలి జార్జియా ఎందుకు వెళ్లారు? అక్కడ అంజలి ఆరోగ్యం మెరుగుపడిందా? కార్తీక్, అంజలి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అమ్మాయి హత్య కేసులో కార్తీక్ నిందితుడిగా ఎందుకు మారాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ..
ప్రేమకు త్యాగమే అర్థమని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని చెప్పే భావోద్వేగభరితమైన ప్రేమకథ ఇది. ఈ కథకు 28°C అనే కొత్త పాయింట్‌ను జోడించి, దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ కొత్త తరహా ప్రేమ, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. అమ్మాయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్తో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది.
అక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్ వైజాగ్ కు మారుతుంది. వైజాగ్ ఫ్లాష్‌బ్యాక్‌లో కార్తీక్, అంజలి ప్రేమ కథ ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా చూపించారు. అంజలి అనారోగ్యం గురించి తెలియడం, ఆమెను కాపాడుకోవడానికి కార్తీక్ చేసే ప్రయత్నాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.
జార్జియా వెళ్ళిన తర్వాత కార్తీక్, అంజలి జీవితాల్లో ఎదురైన సంఘటనలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. సెకండాఫ్ ప్రారంభమైన కాసేపటి నుండి, 28°C సినిమా ఊహకు అందని ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతుంది.
Read this also…Flipkart Wholesale Launches ‘Vyapari Diwas’ 2025 to Empower Kirana Partners with Unmatched Offers
Read this also…Meta Unveils New AI-Powered Advertising Tools to Supercharge E-commerce and Retail Growth in India
Read this also…Startoon Labs Signs MOU with Medplus to Launch Pheezee Joint & Muscle Health Assessment
దర్శకుడు డాక్టర్ కాబట్టి, వైద్య పరమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. రివ్యూలో చెప్పకూడని ఒక పాత్ర కథను పూర్తిగా మారుస్తుంది. ఆ పాత్ర ఎవరు, ఏమిటి అనేది తెర మీదనే చూడాలి. సినిమాలో నవీన్ చంద్ర కార్తీక్‌గా చాలా బాగా నటించాడు.
ఆరేళ్ల కిందటి సినిమా కాబట్టి, ఈ ప్రేమ కథలో అతను ఇప్పటికంటే తాజాగా, యవ్వనంగా కనిపించాడు. షాలినీ అంజలి పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఆమె నటన మెప్పిస్తుంది. ప్రియదర్శి, హర్ష చెముడు, అభయ్ బేతిగంటి స్నేహితుల పాత్రల్లో మంచి సహకారం అందించారు. అయితే, సినిమా నిడివిని తగ్గించడం వల్ల వారి వినోదభరిత సన్నివేశాలు తొలగించినట్లు అనిపించింది.

28°C సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి . శ్రావణ్ భరద్వాజ్ పాటలు, శ్రీచరణ్ పాకాల బీజీఎం ఆకట్టుకుంటాయి. నిర్మాత సాయి అభిషేక్ అభిరుచి మొదటి సినిమాలోనే తెలుస్తోంది. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మంచి భావోద్వేగభరితమైన ప్రేమ కథను కూడా బాగా తెరకెక్కించగలడని 28°C సినిమా నిరూపించింది. ఆయన రచనా శైలి కూడా ఆకట్టుకుంటుంది. అనిల్ విశ్వనాథ్ అతిథి పాత్రలో చిన్న సన్నివేశంలో కనిపిస్తారు.
ప్లస్ పాయింట్స్..
- దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం.
- నటీనటుల నటన.
- శ్రావణ్ భరద్వాజ్ సంగీతం.
- శ్రీచరణ్ పాకాల బీజీఎం.
- సెకండాఫ్ ఉత్కంఠగా సాగడం.
మైనస్ పాయింట్స్..
- ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగతీత.
- సెకండాఫ్ లో కొన్ని డార్క్ సీన్స్.
చివరి మాట..
ఆరేళ్ల కిందట మొదలైన ఈ సినిమా ప్రయాణం ఆకట్టుకునేలా ఉంది. ప్రేమకథలో థ్రిల్లింగ్ అంశాలు ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. వైద్యులైన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అంజలికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
28 డిగ్రీల సెల్సియస్ (28 C) ఉష్ణోగ్రతలోనే ఆమెను ఉంచుతూ, కాపాడుకోవల్సిన పరిస్థితి. అంతకంటే ఉష్ణోగ్రత పెరిగితే ప్రాణాలకే ప్రమాదం. అలాంటి పరిస్థితుల మధ్య ఓ జంట చేసిన భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్రం. స్వతహాగా వైద్యుడైన దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కొన్ని పుస్తకాల స్ఫూర్తితో, వైద్య పరమైన అంశాలతో ఆసక్తికరంగా ఈ సినిమాని మలిచారు.
నటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, వి జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, తదితరులు
సాంకేతిక బృందం: ఎడిటర్ – గ్యారీ బీహెచ్, డీవోపీ – వంశీ పచ్చిపులుసు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – శ్రీచరణ్ పాకాల, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, నిర్మాత – సాయి అభిషేక్, దర్శకత్వం – డా. అనిల్ విశ్వనాథ్
365తెలుగు డాట్ కామ్.. రేటింగ్: 3/5.