365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి 29, 2022:జాతీయ విద్యా విధానానికి (ఎన్.ఈ.పి) అనుగుణంగా ముందుకు సాగుతూ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ప్రైవేట్ పాఠశాలలు,ఎన్.జి.ఓ. లు,వివిధ రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో, సైనిక్ స్కూల్స్ సొసైటీ ద్వారా 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేసి, వ్యక్తిత్వం, క్రమశిక్షణ, జాతీయ కర్తవ్య భావం, దేశభక్తితో కూడిన సమర్థవంతమైన నాయకత్వం, ఈ దేశ గొప్ప సంస్కృతి, వారసత్వం పై పిల్లలు గర్వపడే విధంగా, విలువ-ఆధారిత విద్య పై దృష్టిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో, కొత్త పాఠశాలల ఏర్పాటుకోసం https://sainikschool.ncog.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. ఈ వెబ్ పోర్టల్ ద్వారా, ఇంతవరకు, 284 పాఠశాలలు దరఖాస్తు చేసుకోగా, 2022-23 విద్యా సంవత్సరం కోసం భవిష్యత్ భాగస్వాములను గుర్తించడానికి మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం, ఇప్పటికే, మంచి ప్రతిస్పందన వచ్చిన నేపథ్యంలో, నిర్ణీత కాలపరిమితిలో మూల్యాంకనాన్ని ఖరారు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు, ఇక దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయాలని భావించడం జరిగింది. తదనుగుణంగా, వెబ్ పోర్టల్ https://sainikschool.ncog.gov.in ద్వారా తాజా దరఖాస్తుల స్వీకరణకు 31 జనవరి 2022 తేదీని చివరి గడువుగానిర్ణయించడం జరిగింది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తున్నందున, 2022 జనవరి, 31వ తేదీ తర్వాత తాజా దరఖాస్తులు ఆమోదించడం జరగదు.