365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 10,2025: పార్కుల నామరూపాలు మార్చేస్తున్నారు. ఆలయాలు నిర్మించి, పక్కనే మల్గీలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు.లేఔట్‌లలో పార్కులకు కేటాయించిన స్థలాలకు ఫెన్సింగ్ వేసి కాపాడాలని, ప్రభుత్వ భూములను రక్షించాలని సోమవారం హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు అందాయి.
అమీన్‌పూర్ పెద్దచెరువు, రావిర్యాల చెరువు విస్తీర్ణం ఏటా పెరిగి ఎగువ ప్రాంతాలను ముంచెత్తుతున్నాయని, మూసేసిన తూములు తెరిపించి అలుగు ఎత్తు తగ్గించాలని పలువురు కోరారు.
మురుగునీటి వల్ల చెరువులు నిండి పరిసరాలు మునుగుతున్నాయని వాపోయారు. ఓల్డ్ అల్వాల్ సర్వే నంబరు 576లో క్వారీ గుంతల్లో మురుగునీరు చేరి దుర్గంధం వ్యాపిస్తోందని, గుంతలను మట్టితో పూడ్చి పార్కులుగా అభివృద్ధి చేయాలని గంగ అవెన్యూ రెసిడెంట్స్ డిమాండ్ చేశారు.
ఫిర్యాదులను హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.

ముఖ్య ఫిర్యాదులు:
మచ్చబొల్లారం (మేడ్చల్-మల్కాజిగిరి): సర్వే నంబరు 188లో 30 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని బాలాజీ ఎన్‌క్లేవ్ రెసిడెంట్స్. 60 వేల ఇళ్లున్న ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి కేటాయించాలని, కబ్జాలు తొలగించాలని డిమాండ్.
అమీన్‌పూర్ (సంగారెడ్డి): పెద్దచెరువు విస్తరణతో ప్లాట్లు మునిగిపోతున్నాయి. తూములు బంద్ చేయడం, అలుగు ఎత్తు పెంచడంతో మురుగు-వర్షపు నీరు చేరుతోంది. అలుగు ఎత్తు తగ్గించి, చెరువు వాస్తవ విస్తీర్ణం నిర్ణయించాలని ప్లాట్ యజమానులు.
రావిర్యాల (రంగారెడ్డి): అమీన్‌పూర్‌లాగే చెరువు విస్తరణ సమస్య. రోడ్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. సరైన విధానంతో చెరువు పరిధి నిర్ణయించాలని నివాసితులు.
రావిర్యాల హౌసింగ్ బోర్డు కాలనీ: 545 ప్లాట్ల లేఔట్‌లో ఖాళీ స్థలాలు కబ్జాలకు గురి. పార్కుల్లో మందిరాలు, షెడ్డులు వేసి అద్దెలకు ఇస్తున్నారు. రోడ్లు బ్లాక్ చేసి కాజేస్తున్నారు.

బాగ్‌లింగంపల్లి (ముషీరాబాద్): హౌసింగ్ బోర్డు కాలనీలో 1,300 గజాల పిల్లల పార్కు కబ్జా. స్టీల్-ఐరన్ దుకాణాలు, సర్వీసింగ్ సెంటర్లు పెట్టారు. GHMC, హౌసింగ్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. వ్యాపారాలు ఆపి పార్కు కాపాడాలని హైడ్రాకు విన్నవించారు.
