Wed. Jan 15th, 2025

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి15,హైదరాబాద్: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు వస్తుంది గనుక దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజుతోనే మొదలవుతుంది. మనదేశంలో వేదకాలం నుంచి గురూపదేశం, గురుపూజ, వేదపారాయణ వంటి కార్యక్రమాలను సంక్రాంతి రోజు ఆరంభించటం ఆచారం. స౦క్రా౦తి తెలుగు స౦స్కృతికి అసలైన తార్కాణ౦గా నిలుస్తు౦ది. తెల్లవారు జాము నుంచే వినిపించే హరి దాసుల కీర్తనలు, ఇళ్లముందు హరివిల్లును మరిపించే రీతిగా తీర్చిదిద్దిన ర౦గవల్లులు, వాటిపై గుమ్మడి పూలను శిరస్సున ధరించి పూజలందుకునే గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఎడ్ల, కోళ్ల పందేలు వరకు ప్రతిదీ తెలుగు సా౦ప్రదాయాన్ని తెలియచేస్తాయి. ఇతర పండుగలకు వచ్చినా రాకున్నా ఈ పండుగకు అందరూ తమ స్వగ్రామాలకు చేరి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

సంక్రాంతి చరిత్ర
మన పురాణాల ప్రకారం సంక్రాంతి రోజే విష్ణుమూర్తి వరాహస్వామి అవతారంలో ప్రళయం నుంచి భూమిని ఉద్దరించాడు. మరో అవతారంలో ఆయనే వామనుడిగా వచ్చి బలి నుంచి దానం పొంది, బలిని పాతాళానికి పంపాడు. ద్వాపర యుగంలో ఉత్తరాయణ ఘడియలకై అంపశయ్యపై ఎదురుచూసిన భీష్మాచార్యుడు సంక్రాంతి నాడే పరమపదాన్ని పొందాడు. ఈ పండుగ రోజే భగీరధుడు గంగమ్మను భూమి మీదకు తెచ్చి భస్మరాశులుగా మారిన తన పూర్వజులను తిరిగి బతికించుకున్నాడు. శబరిగిరిపై కొలువైన అయ్యప్ప స్వామీ జ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే పావన దినం ఇదే.

ఏమి చెయ్యాలంటే?
ఈ రోజు ఇంటిల్లిపాదీ ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకుంటారు. అనంతరం నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని, సున్ని పిండి, కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. అవకాశం ఉన్నవారు తప్పక నదీ స్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు ధరించి ఇష్టదేవతలను, కులదేవతలను, గ్రామదేవతలను స్మరించి పూజించాలి. పూజ అనంతరం తల్లిదండ్రులు లేనివారు తప్పక తమ పితృదేవతలను ఆరాధించి వారికి తర్పణాలు వదలాలి. ఏడాదిలో వచ్చే 12 సంక్రమణాల్లో మిగిలిన 11 సందర్భాల్లో తర్పణం ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం రోజు మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇవ్వాలి. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి, పిల్లలు ప్రయోజకులవుతారు. సంక్రాంతి రోజున గోమాతను దర్శించి, గ్రాసం తినిపించడం వలన శుభాలు చేకూరతాయి. ఈ రోజు సాయంత్రం ప్రదోష వేళలో ఆవునెయ్యితో చేసే శివాభిషేకం, శివాలయంలో ‘నువ్వుల నూనె’తో దీపం పెట్టడం వలన పుణ్యఫలం సిద్ధిస్తుంది.

సంక్రాంతి దానం తప్పనిసరి

  సంక్రాంతి రోజు తప్పకుండ పెరుగు దానం చేయాలి. దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలగటమే గాక వారి కారణంగా ముందురోజుల్లో సౌఖ్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున కూష్మాండం (గుమ్మడి కాయ) దానం చేయాలి. అలాగే ఈ రోజున తర్పణాలు విడిచిన అనంతరం బ్రాహ్మణుడికి బియ్యం, కూరగాయలు, ఉప్పు తదితరాలను సమర్పిస్తారు. ఏడాది పొడవునా సేవలందించే కులవృత్తుల వారికి కూడా ఈ రోజు రైతులు శక్తిమేర అన్న, ధాన్య, వస్త్ర దానం చేస్తారు.

పిండి వంటలు
చలికాలంలో శరీరంలో ఏర్పడిన వాత దోషాన్ని నివారించేందుకు బెల్లం, నువ్వులు తినాలని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఈ పండుగకు తెలుగు వాళ్ళు అరిసెలు చేసుకుని తింటారు. తీపి తినండి, తియ్యగా మాట్లాడండి అనే అంతరార్ధం కూడా ఇందులో ఉంది. సంక్రాంతి రోజున పాలు పొంగించి, పొంగలి చేసి దేవునికి నివేదించటం సంప్రదాయం.

గ్రామీణ సంబరాలు
సంక్రాంతి రోజులలో కనిపించే సుందర దృశ్యం.. గంగిరెద్దుల నాట్యం. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. గంగిరెద్దుల వాళ్ళు ‘అయ్యగారికి దండం పెట్టు’ , ‘అమ్మగారికి దండం పెట్టు’ అనగానే గంగిరెద్దు చేసే విన్యాసాలు, మనం ఇచ్చే కానుకను స్వీకరించిన తరవాత ఆ గంగిరెద్దులు తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలిపే తీరు అద్భుతం. మరోవైపు కాలికి గజ్జెలు, ఒక చేత చిడతలు, మరో భుజంపై వీణ వంటి వాద్యాన్ని ధరించి తెల్లవారు జామునే ‘హరిలో రంగ హరీ’ అంటూ శృతిబద్ధంగా పాడుతూ నెత్తిన రాగి అక్షయపాత్రతో ఇల్లిల్లూ తిరిగే హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇక.. పండుగ రోజున వేసే కోడి ప౦దాలు సంక్రాంతికి అదనపు ఆకర్షణ. సంప్రదాయం, కుటుంబ అనుబంధాలు, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ సృహ వంటి ఎన్నో అంశాల కలగలుపు మన సంక్రాంతి.

error: Content is protected !!