365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ తిరుపతి, జూలై 02,2021 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు శ్రీవారి చెంత ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతమని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్.జవహర్ రెడ్డి అన్నారు. టిటిడిలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు 118 మందికి శుక్రవారం తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈఓ కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వివిధ పరిపాలనా పరమైన కారణాల వలన పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు ప్రభుత్వ అనుమతితో ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. వీరిలో 81 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక అసిస్టెంట్, 20 మంది ఆఫీస్ సబార్డినెంట్స్, ఒక డ్రైవర్, ఏడుగురు ఎమ్‌పిడబ్లూ, నలుగురు హెల్పర్లు, ముగ్గురు క్లీనర్లు, ఒక ఫారెస్టు మజ్దూర్ ఉన్నట్టు చెప్పారు. వీరందరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఇకపై కారుణ్య నియామక ప్రక్రియను సులభతరం చేశామని, ఉద్యోగి మరణించిన 15 రోజుల లోపు వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లో నియామక పత్రం అందిస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు పొందిన వీరందరికీ రెండు వారాల పాటు శ్వేతలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కారుణ్య నియామక పత్రాలు అందించేందుకు శ్రమించిన హెచ్ఆర్ విభాగం ఆధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఈవో అభినందించారు.
తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువులో చేరడం మహద్భాగ్యం అన్నారు. టిటిడి ఉద్యోగాన్ని జీవన ఆదాయ వనరుగా కాకుండా ధార్మిక సేవగా భావించి ఆధ్యాత్మిక నిరతిని చాటాలన్నారు. ఉద్యోగులు శ్రీవారి ఆలయ చరిత్రను, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలన్నారు. దేవాలయ సంస్కృతి ప్రారంభమైన కాలంలోనే తిరుమల పుణ్యక్షేత్రం వెలసిందన్నారు. తిరుమలకు 2 వేల సంవత్సరాలకు పైగా, తిరుపతికి 900 సంవత్సరాల లిఖితపూర్వక చరిత్ర ఉందని తెలిపారు.
టిటిడిలో 118 మందికి కారుణ్య నియామకాలు టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి