365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,తిరుపతి, జూలై 5: వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలాపురం గ్రామంలోని భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలం పల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. గణపతి పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి వాస్తుహోమం, నవగ్రహ ఆరాధన, నవరత్న స్థాపన,శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చన, నైవేద్యం,హారతి సమర్పించారు.
ఈ ఆలయంలో రూ.3.54 కోట్ల వ్యయంతో టిటిడి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో త్రితల రాజగోపుర నిర్మాణం, శివాలయం, అమ్మవారి ఆలయం, ముఖమండపం పునర్నిర్మాణం, ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటు, వినాయక స్వామివారి ఆలయ నిర్మాణం, ఆలయ ప్రాకారం నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. ఒక్క సెంటు భూమి అన్యాక్రాంతం కానివ్వం : దేవాదాయశాఖ మంత్రిరాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని దేవాదాయ శాఖ మంత్రి వెలం పల్లి శ్రీనివాస్ చెప్పారు. సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. మరమ్మత్తులకు గురైన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.