365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుపతి,జులై 14,2021:శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామివారి షష్టిపూర్తి మహోత్సవం బుధవారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల శ్రీ చిన్నజీయర్ మఠంలో వేడుకగా జరిగింది. టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
షష్టిపూర్తి మహోత్సవంలో భాగంగా జులై 10వ తేదీ నుంచి మఠంలో నాళాయిర దివ్యప్రబంధ పారాయణం జరుగుతోంది. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు నాళాయిర దివ్యప్రబంధం పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ దివ్యదేశాల నుండి తీసుకొచ్చిన ప్రసాదం, పుష్పమాల మర్యాదను శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారు స్వీకరించారు.
శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారు 1961వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా తిరుక్కుర్‌ముడి అనే దివ్యదేశంలో జన్మించారు. శ్రీరంగంలో వైదిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 30 సంవత్సరాల పాటు అధ్యాపక కైంకర్యం నిర్వహించారు. భగవదనుగ్రహంతో పదేళ్ల క్రితం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి బాధ్యతలు స్వీకరించారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారితో కలిసి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల కైంకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.