365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ ,ఢిల్లీ, జూలై 30,2021: భారత జాతీయ చలనచిత్ర భాండాగారం (ఎన్‌ఎఫ్‌ఏఐ) తన చలనచిత్ర నిధికి 450కిపైగా చిత్రాలకు చెందిన అరుదైన స్లైడ్లను కొత్తగా జోడించింది. తొలినాళ్ల సినిమా వీక్షణ అనుభవంలో ఒక సమగ్ర భాగమైన ఈ గ్లాస్ స్లైడ్లు లభ్యం కావడంపై మేమెంతో సంతోషిస్తున్నాం. రెండు నలుచదరపు అద్దపు పలకల మధ్య అమర్చిన పాజిటివ్ ఫిలిమ్‌తో ఇవి రూపొందించబడ్డాయి. సినిమా ప్రదర్శనకు ముందు లేదా ప్రదర్శన విరామ సమయంలో రాబోయే ఆకర్షణీయ అంశాలను వెల్లడించేందుకు ఈ స్లైడ్లను వినియోగించేవారు. ఈ గ్లాస్ స్లైడ్ల తయారీ కోసం వాడే పాజిటివ్ ఫిల్ములు సంబంధిత సినిమా పోస్టర్లు లేదా దిన, వార పత్రికలలో ప్రచార సరంజామాకు సంబంధించినవి కావడం గమనార్హం. ఈ గ్లాస్ స్లైడ్లు 1930 నుంచి 1950 దశకం మధ్య వరకూగల కాలానికి సంబంధించిన తెలుగు చలనచిత్ర చరిత్రను మనకు ప్రదర్శిస్తాయి. భారతీయ టాకీ సినిమా చరిత్రలో తొలి దశాబ్దాలనాటి తెలుగు సినిమా వైభవం జాడలను ఈ ఫ్రేములు చక్కగా చూపుతాయి.
ఎన్‌ఎఫ్‌ఏఐ సేకరించిన గ్లాస్ స్లైడ్లలో సాంఘిక సంస్కరణలకు మార్గనిర్దేశం చేస్తూ వితంతు వివాహాలపై వి.వి.రావు నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ (1939) వంటి చిత్రంసహా అనేక ముఖ్యమైన చిత్రాలకు చెందిన స్లైడ్లు ఉన్నాయి. అలాగే అదే సంవత్సరంలో చిత్తూరు వి.నాగయ్య నటించగా, బి.ఎన్.రెడ్డి నిర్మించిన ‘వందేమాతరం’ (1939), అటుపైన అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి నాయకానాయికలుగా ఘన విజయం సాధించిన ‘కీలుగుర్రం’ (1949), మరొక నట దిగ్గజం ఎన్.టి.రామారావు కథానాయకుడుగా విశేష ప్రజాదరణ పొందిన చిత్రం ‘దాసి’ (1952), విమర్శకుల ప్రశంసలందుకున్న శరత్‌చంద్ర చటోపాధ్యాయ నవల దేవదాస్ ఆధారంగా అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, లలిత ప్రధాన పాత్రధారులుగా వేదాంతం రాఘవయ్య నిర్మించిన ‘దేవదాసు’ (1953)సహా అనేక చిత్రాలకు చెందిన స్లైడ్లు ఉన్నాయి. ఈ మేరకు 1939 నుంచి 1955 మధ్యకాలంలో నలుపు-తెలుపులో తీసిన దాదాపు 70 తెలుగు సినిమాలకు చెందిన స్లైడ్లు వీటిలో ఉన్నాయి. గత సంవత్సరం కూడా ఎన్‌ఎఫ్‌ఏఐ దాదాపు 400కుపైగా గ్లాస్ స్లైడ్లను సమీకరించింది. తాజాగా సేకరించినవిసహా హిందీ, గుజరాతీ, తెలుగు చలనచిత్రాలకు సంబంధించిన 2000కుపైగా స్లైడ్లు ఎన్‌ఎఫ్‌ఐఏ భాండాగారంలో ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఏఐ డైరెక్టర్ ప్రకాష్ మాగ్దం మాట్లాడుతూ- “ఈ గ్లాస్ స్లైడ్లు భారతీయ చలనచిత్ర వారసత్వానికి సంబంధించిన ఎంతో అరుదైన రికార్డులు. వీటిని మా భాండాగారంలో భద్రపరచడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఇంతపెద్ద సంఖ్యలో గ్లాస్ స్లైడ్లు లభ్యం కావడం ఎంతో అరుదైన విషయమేగాక విశేష అన్వేషణకూ నిదర్శనం. ఇదే తరహాలో అరుదైన ఫిల్మ్ ఫుటేజీలు, ఫొటోలు, పోస్టర్లు, లాబీ కార్డులు వంటివాటిని పదిలపరచేందుకు వీలుగా మాకు అందజేయాలని చలనచిత్ర ప్రేమికులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నారు. ప్రస్తుత అరుదైన సామగ్రి సేకరణ గురించి ఎన్‌ఎఫ్‌ఏఐ డాక్యుమెంటేషన్ ఇన్‌చార్జి శ్రీమతి ఆర్తీ కర్ఖానిస్ మాట్లాడుతూ- “తెలుగు సినిమా తొలినాళ్లలో చిత్రాలపై ప్రజల్లో ప్రచారం గురించి ఈ గ్లాస్ స్లైడ్లు సంక్షిప్త సమాచారమిస్తాయి. చలనచిత్ర పరిశోధకులకు ఇవెంతో అమూల్య ఉపకరణాలు కాగలవు. వీటిని త్వరలోనే డిజటలీకరణ చేయబోతున్నాం” అని తెలిపారు.