365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 27,2021: భారతీయ యువతలో గుండె ఆరోగ్యం ఎందుకు ఆందోళనకరం? మరింత తెలుసుకోండి!
ఇటీవలి కాలంలో భారతీయ యువతలో గుండె సంబంధిత సమస్యలు దేశంలోని ఆరోగ్యనిపుణులకు సవాలుగా మారుతున్నాయి. మన దేశంలో ముఖ్యంగా యువ జనాభాలో హార్ట్ ఎటాక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
యువతలో హార్ట్ ఎటాక్‌లు, కార్డియాక్ అరెస్టుల వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటో గ్లోబల్ ఆసుపత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎం సాయి సుధాకర్ వివరించారు. మానసిక ఒత్తిడి, శారీరక ఆరోగ్యం, ఇతర కారణాలు యువతలో గుండె సమస్యలు పెరగడానికి ప్రధానంగా దోహదం చేస్తున్నాయని ఆయన చెప్పారు.
1. తరచు వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలోనూ హార్ట్ ఎటాక్‌లు, కార్డియాక్ అరెస్టులు ఎందుకు ఉంటున్నాయి?
వ్యాయామం ఒక్కటే సరిపోదు. ఒత్తిడి కారణంగా చాలామంది మద్యం, డ్రగ్స్ తీసుకుంటున్నారు. చాలామంది వ్యాయామం చేస్తున్నారు గానీ, ఒత్తిడి నివారణకు ధూమపానం, డ్రగ్స్ లాంటివి అలవాటు చేసుకుంటున్నారు. వీటివల్ల కలిగే హార్మోన్ మార్పులు గుండె సమస్యలకు నేరుగా కారణం అవుతున్నాయి.
2. హార్ట్ ఎటాక్‌ల విషయంలో ఒత్తిడి, మానసిక ఆరోగ్యం పాత్ర ఏంటి?
శారీరక ఆరోగ్యం లాగే మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. మనం ఎక్కువగా ఉద్యోగాలు, జీవితం గురించి ఆలోచిస్తుంటాం. మన జీవనశైలిలోనే ఒత్తిడి ఉంటుంది. చాలామంది ఎక్కువ గంటలు, రోజంతా పనిచేస్తున్నారు. తమ శారీరక, మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. వృత్తిలో తమను తాము నిరూపించుకోవాలనే ఒత్తిడి వల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి సమయం కేటాయించట్లేదు.
3. జన్యుపరమైన లేదా కుటుంబ చరిత్ర కూడా కారణం అవుతుందా?
మన జన్యువుల కారణంగా ఆసియావాసులకు గుండె సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. దాని విషయంలో ఏమీ చేయలేం. అందువల్లే పాశ్చాత్యదేశాల వారి కంటే మన దేశంలో యువతకు ఎక్కువగా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి.
4. ఈ సమస్యలను నివారించడానికి ప్రజలు ఏం చేయగలరు?
ఎప్పటికప్పుడు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి. ఒత్తిడి ఉందని పొగతాగకూడదు. డ్రగ్స్ వాడకూడదు. యోగ, ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి. జీవనశైలి అలవాట్లలో కాస్త నెమ్మదిగా వ్యవహరించాలి.
5. ఎందుకు భారతీయులు, ముఖ్యంగా యువతకు హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి?
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ చెప్పేదాన్ని బట్టి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారి కంటే భారతీయులకు గుండెవ్యాధి ముందస్తు హెచ్చరికలు లేకుండా 33% ముందుగా వస్తుంది.
భారతీయ పురుషుల్లో 50 ఏళ్లలోపు వారికే 50% హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి, 40 ఏళ్ల లోపువారికి 25% హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. భారతీయ మహిళల్లో కూడా గుండెవ్యాధులతో మరణాలు ఎక్కువగానే ఉన్నాయి.
భారతీయులకు జన్యుపరంగా గుండెవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. పాశ్చాత్య దేశాల వారి కంటే పదేళ్ల ముందుగా భారతీయులకు గుండెవ్యాధులు వస్తాయని పరిశోధనల్లో తేలింది. గుండెకవాటాల వ్యాధులు కూడా భారతీయులకు ఎక్కువగా వస్తాయి. పాశ్చాత్య దేశాల్లో 60లలో గుండెవ్యాధి వస్తే, భారతీయులకు 50లలోనే వస్తుంది. ఇప్పుడు ఇంకా తక్కువ వయసులో వస్తోంది. భారతీయులకు గుండె కవాటాలు పాశ్చాత్యుల కంటే చిన్నగా ఉంటాయి. ముందుగానే మధుమేహం, ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల భారతీయ యువతలో హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి.
మానసిక ఒత్తిడి, మద్యపానం కూడా ఇందుకు ప్రధాన కారణం. ధూమపానం, కుటుంబ చరిత్ర కూడా కారణాలే. భారతీయులు కొవ్వుపదార్థాలు ఎక్కువగా తింటారు. మధుమేహం, రక్తపోటు, కదలని జీవనశైలి, ఎక్కువ కొవ్వు, ఊబకాయం అన్ని వయసుల్లోనూ ముప్పు కారణాలే. కొందరికి ఎలాంటి ముప్పు కనపడకపోవచ్చు. అప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఎలాంటి కారణం లేకుండానే గుండె ఆగిపోవచ్చు.
15-20 శాతం మంది రోగులు 40 ఏళ్ల లోపువారే. ఇందుకు ప్రధానకారణం ఒత్తిడి. యువ పేషెంట్లలో చాలామంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులే. వాళ్లు అమెరికా క్లయింట్లతో పనిచేస్తారు. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా టార్గెట్లు పెరిగాయి, ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. రాత్రిపూట పడుకోవడంతో నిద్ర ఉండట్లేదు. వ్యాయామానికి సమయం ఉండదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. నిద్రలేమితో హార్మోన్ల సమతుల్యం దెబ్బతిని, ఊబకాయం వచ్చి మధుమేహం, రక్తపోటు, చివరకు గుండెవ్యాధులు వస్తాయి.
6. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా యువతకు మీరిచ్చే ఆరోగ్యపరమైన సలహా ఏంటి?
ఆయాసం, గుండెనొప్పి, ఎక్కువ చెమటపట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. ధూమపానం మానాలి, అధిక మద్యపానం మానుకోవాలి. క్రియాశీలకమైన జీవనశైలి ఉండి, కొవ్వుతో కూడిన ఆహారాలు తినకుండా చూసుకోవాలి. 20లు, 30లలో ఉన్నవాళ్లకు కుటుంబంలో గుండెకవాటాల వ్యాధులున్న చరిత్ర ఉంటే, తరచు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి.