Wed. Dec 18th, 2024

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 28,2021:టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకున్నది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్‌(72) ఇకలేరు. క‌రోనాతో గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో గతకొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న శివశంక‌ర్ మాస్ట‌ర్‌ క‌న్నుమూశారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమాలో ధీర ధీర పాట‌కు అందించిన కొరియోగ్ర‌ఫీకి శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు త‌మిళ‌నాడుస్టేట్ ఫిలిం అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.1996లో పూవే ఉన‌క్క‌గ‌, 2004లో విశ్వ తుల‌సి, 2006లో వ‌ర‌లారు, 2008లో ఉలియిన్ ఓస‌య్ చిత్రాల‌కు గానూ ఈ అవార్డులు అందుకున్నారు.

10 భాషల్లో కొరియోగ్రాఫ‌ర్‌గా సేవలు..

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్1948 డిసెంబ‌ర్ 7న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి క‌ళ్యాణ సుంద‌రం పండ్ల వ్యాపారిగా పనిచేసేవారు. తెలుగు, త‌మిళ చిత్రాల‌తో స‌హా దాదాపు 10కి పైగా భాషల్లో కొరియోగ్రాఫ‌ర్‌గా శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ సేవ‌లందించారు. ఆయ‌న కెరీర్‌లో 800కు పైగా సినిమాల‌కు డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌నిచేశారు.1975లో వ‌చ్చిన త‌మిళ చిత్రం పాట్టు భ‌ర‌త‌మ‌మ్ చిత్రంతో ఆయ‌న కెరీర్ మొద‌లైంది. ఈ సినిమాకు ఆయ‌న స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు. ఆ తర్వాత కురువికూడు చిత్రంతో కొరియోగ్రాఫ‌ర్‌గా మారారు. డ్యాన్స్ మాస్ట‌ర్‌గానే కాకుండా ప‌లు సినిమాల్లోనూ ఆయ‌న న‌టించారు. 2003లో వ‌చ్చిన ఆల‌య్ సినిమాతో తొలిసారి ఆయ‌న వెండితెర‌పై న‌టుడిగా క‌నిపించాడు. నేనే రాజు నేనే మంత్రి, అక్ష‌ర‌, స‌ర్కార్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, రాజుగారి గ‌ది 3 స‌హా దాదాపు 30 చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.బుల్లితెర‌పై ప‌లు డ్యాన్స్ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు. శివశంకర్ మాస్టర్ భార్య, పెద్దకొడుకు కూడా కరోనా బారీన పడిన విషయం తెలిసిందే.

error: Content is protected !!