365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 26,2022: శ్రీ‌వారి భక్తాగ్రగణ్యులైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, నాథ‌ముని ఆచార్యులు, అనంతాచార్యులు, ప‌ల్ల‌వ రాణి సామ‌వై త‌దిత‌రుల జీవిత చ‌రిత్ర‌ల‌ను భ‌క్త‌లోకానికి అందించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో స‌రి క్రొత్త శీర్షిక‌లు రూపొందించి ప్ర‌సారం చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి అతిథి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో ఈవో ఎస్వీబిసి కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు రచించిన వేలాది సంకీర్త‌న‌ల‌ల్లో ప్రాచుర్యంలో లేని సంకీర్తనలకు జనబాహుళ్యంలో విస్తృతప్రచారం కల్పించాలనే సత్సంకల్పంతో యువతీ యువకులకు ఎస్వీబిసిలో అదివో… అల్లదివో… అన్నమయ్య పాటల పోటీలు గ‌త ఏడాది డిసెంబ‌రులో ప్రారంభించిన‌ట్లు తెలిపారు. మొదట ఈ కార్యక్రమాన్ని 26 ఎపిసోడ్లు చేయాలని నిర్ణయించామ‌ని, కానీ భక్తుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణ దృష్ట్యా ఒక‌ సంవత్సరం 53 వారాల పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తరిగొండ వెంగమాంబ పాటలకు మ‌రింత విస్తృత‌ ప్రాచుర్యం కల్పించ నున్న‌ట్లు తెలిపారు.

అదేవిధంగా 1200 సంవ‌త్స‌రాల క్రితం శ్రీ‌వారి ఆల‌యానికి భోగ శ్రీ‌నివాస మూర్తిని బ‌హూక‌రించిన ప‌ల్ల‌వ రాణి సామ‌వై, వైష్ణ‌వ ఆచార్యుల్లో అగ్రగ‌ణ్యుడు నారాయ‌ణ దివ్య ప్ర‌బంధంను ర‌చించిన నాథ‌ముని ఆచార్యులు జీవిత విశేషాల‌తో నూత‌న శీర్షిక‌లు రూపొందించి ప్ర‌సారం చేయ‌డానికి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు చెప్పారు.

ఇటీవల ప్రారంభించిన ఎస్వీబిసి క‌న్న‌డ ఛాన‌ల్‌లో దాస సాహిత్యంలోని పాట‌లను బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ” దాస న‌మ‌నం ” కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా పురంద‌ర‌దాసుల సంకీర్త‌న‌ల‌ను త్వ‌ర‌లో ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఈవో చెప్పారు.