365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 31,2022: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు బుధవారం రాత్రి 8 నుంచి పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత స్వామి వారి వాహనసేవ మాడ వీధుల్లో జరగడంతో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు స్వామివారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేశారు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమయ్యాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.