![](http://365telugu.com/wp-content/uploads/2022/04/ttd2-6.jpg)
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట,ఏప్రిల్ 15,2022: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు 10 గంటల వరకు జరిగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2022/04/ttd1-6.jpg)
అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు. రాత్రి 11 నుంచి 12 గంటల వరకు గజవాహనసేవ అత్యంత వేడుకగా జరగనుంది.
గజ వాహనం :
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులను కటాక్షించనున్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2022/04/ttd-7.jpg)
సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.