Sat. Nov 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ ,మే 24,2022:కార్గో, పార్శిల్‌ సేవ‌ల ద్వారా వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువయ్యేందుకు టి.ఎస్‌.ఆర్టీసీ క‌స‌ర‌త్తు మొద‌లెట్టింది. వేగంగా, భ‌ద్రంగా, చేరువ‌గా అనే ల‌క్ష్యంతో ఈ సేవ‌ల్ని ప్రారంభించిన అన‌తి కాలంలోనే ఆద‌ర‌ణ‌ను చూర‌గొంది. 177 బ‌స్‌స్టేస‌న్ల‌తో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా కొన‌సాగిస్తున్న పార్శిల్‌ సేవ‌లు బుకింగ్ / డెలివ‌రీ పాయింట్ల నుంచే కాకుండా నేరుగా వినియోగ‌దారుల ఇంటి వ‌ద్ద‌కే ఈ సేవ‌ల్ని అందించే దిశ‌లో ప్ర‌తిపాద‌న‌ల్ని రూపొందించింది.

మొద‌టి, చివ‌రి మైల్ క‌నెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావ‌డానికి భాగ‌స్వాముల ను ఆహ్వానిస్తోంది. 11 రీజియ‌న్లు, 97 బ‌స్ డిపోలతో విస్తృత నెట్‌వర్క్ క‌లిగి ఉన్న
టి.ఎస్‌.ఆర్టీసీ, వినియోగ‌దారుల చెంత‌కే అంటే హోమ్ డెలివ‌రీ, హోం పిక‌ప్
స‌దుపాయాల్ని ప్రారంభించాల‌ని యోచిస్తోంది. ఈ విష‌యాన్ని సంస్థ ఛైర్మ‌న్
బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎం.ఎల్‌.ఎ గారు, వైస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్
వి.సి.స‌జ్జ‌నార్‌, ఐ.పి.ఎస్ గారు వెల్ల‌డించారు. ప్ర‌జా ర‌వాణా సేవ‌ల్లో భాగంగా
న‌డుపుతున్న బస్సుల ద్వారా పార్శిల్స్ పాయింట్ నుంచి పాయింట్ వ‌ర‌కు
చేర‌వేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాల‌తో
పాటు కొన్ని రీజియ‌న్ల‌లో మాత్రమే హోం డెలివ‌రీ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని
తెలిపారు. అయితే, వినియోగ‌దారుల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతం కోసం హోం పిక‌ప్
తో పాటు అన్ని జిల్లాల‌లోనూ హోం డెలివ‌రీ సేవ‌ల్ని త్వ‌ర‌లో అందుబాటులోకి
తీసుకురావ‌డ‌మే త‌మ ప్ర‌య‌త్నం అన్నారు.


ఈ సేవ‌ల్ని అందించేందుకు గానూ భాగ‌స్వాముల‌ను ఆహ్వానించ‌డం జ‌రుగుతోంద‌ని వారు స్ఫ‌ష్టం చేశారు.టి.ఎస్‌.ఆర్టీసీతో చేతులు క‌లుప‌డానికి ఆస‌క్తి ఉన్న వారు ఎవరైనా ముందుకు రావొచ్చ‌ని కోరారు. ఆర్థిక సామార్థ్యాల‌తో పాటు వారి బిజినెస్ వివ‌రాల‌ను splofficertsrtc@gmail.com మెయిల్ కు పంప‌వ‌చ్చ‌ని చెప్పారు. మరింత సమాచారం కోసం, కార్గో అండ్ పార్శిల్ విభాగం అసిస్టెంట్‌ ట్రాఫిక్ మేనేజ‌ర్
(నెం.9154197752), 3వ అంత‌స్తు, బస్ భవన్, హైదరాబాద్‌లో ఈ నెల 27 లోపు
సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

error: Content is protected !!