365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, జూన్12, 2022: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం రాత్రి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణులవారు బకాసురుడిని వధించిన అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుంచి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది.
ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.