PUSHPAYAGAM
PUSHPAYAGAM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జులై 16, 2022: అప్పలాయ గుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

PUSHPAYAGAM

ఆల‌యంలో జూన్ 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

PUSHPAYAGAM

ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు.

PUSHPAYAGAM

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో శ్రీపద్మావతి, శ్రీఆండాళ్‌ సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 2.50నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 14 రకాలకు చెందిన 1.2 టన్నుల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆ తరువాత పెద్ద‌శేష వాహనంపై స్వామివారు ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

PUSHPAYAGAM