365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం,ఆగస్టు 3,2022: 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని జాతీయ జెండాగా మార్చాలని ప్రధాని నరేంద్ర దేశ పౌరులను కోరారు. దీంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ పిక్చర్ ను మార్చుకుంటున్నారు ప్రజలు. స్వాతంత్య్ర వజ్రదినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలో భాగంగా మంగళవారం నగరంలోని స్వాతంత్య్ర సమరయోధుల స్మారక పార్కు, మహాత్మాగాంధీ ఆలయంలో 105 అడుగుల జాతీయ జెండాను కలెక్టర్ శ్రీకేష్ బి లథాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కసరత్తు చేసి జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 105 అడుగుల పొడవైన జాతీయ జెండా తయారీకి నిధులు అందించిన వ్యక్తులను ఆయన సత్కరించారు. పిల్లల్లో దేశభక్తి విలువలు పెంపొందించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.