365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, విజయవాడ,సెప్టెంబర్ 25,2022: ప్రముఖ పుణ్యక్షేత్రం అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా కోరిన వారికి వరాలిచ్చే కొంగుబంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది. దుర్గుణాలను పోగొట్టి కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయిగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకిగా పేరును సంపాదించింది.
అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారు కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు. నవరాత్రుల వేళ.. కరుణించవమ్మా.. కనకదుర్గమ్మా.. జై భవానీ.. జైజై భవానీ నామస్మరణతో వేడుకునేందుకు రేపటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలిరానున్నారు.
కరోనా తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు చేస్తోన్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు పది రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.