365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 27,2022: కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడాలో రంగనాథ స్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పకడ్బంధీగా చేయాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
మంగళవారం రంగనాథ స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుమల, తిరుపతి దేవస్థానం తరువాత జియాగూడలోని రంగనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అద్భుతంగా జరుగుతాయని అన్నారు.
ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
జీహెచ్ఎంసీతో పాటు శాంతి భద్రతల విషయంలో రాజీపడకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. స్థానికులు కూడా అధికారులకు సహకరించి వేడుకలు విజయవంతంగా జరిగేందుకు సహకరించాలని అన్నారు.