365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,జనవరి 7,2023: ఆంధ్ర ప్రదేశ్ లోని అర్చకుల సంక్షేమం కోసం దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. “అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం, ఇనాం భూములపై వంతుల వారీగా, ధూప దీప నైవేద్యం పథకం కింద, నెలసరి వేతనంపై పనిచేస్తున్న అర్చకులందరికి ఇకనుంచి నూరుశాతం వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపులు చేయటం జరుగుతుందని ” ఉపముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
“ప్యానల్ డాక్టర్ నిబంధనలు మేరకు సూచించిన మొత్తం ఖర్చును చెల్లించే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు”.
దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం కోసం చేసిన ఖర్చులో ప్రస్తుతం అర్చక సంక్షేమ నిధి నుంచి 50శాతం మాత్రమే చెల్లించడం జరుగుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. దీనిని తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా అధికారులను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.
ఇటీవల ప్రారంభించిన అర్చక ,ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి వెబ్ సైట్ www.aparchakawelfare.org ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన వివరించారు.