365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, ఫిబ్రవరి 23,2023: ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ విద్యార్ధుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
రైలు రవాణా సేవలను అందించే మేధా సర్వో డ్రైవ్స్ లో మూడు లక్షల ప్యాకేజీతో వందమంది ఇంజనీరింగ్ ట్రైనీలకు అవకాశాలు ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిప్లమా విద్యార్ధులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇప్పటికే గత డిసెంబర్ లో రూ.3 లక్షల ప్యాకేజీతో మేధా సర్వో డ్రైవ్స్ 31 మందికి పారిశ్రామిక శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశం కల్పించిందని నాగరాణి పేర్కొన్నారు.
సాంకేతిక విద్యాశాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాల ఫలితంగా మరోసారి డిప్లమా విద్యార్ధులను ఇంజనీరింగ్ ట్రైనీలుగా అవకాశం కల్పించేందుకు సంస్ధ అంగీకరించిందన్నారు.
ఈనెల 26,27 తేదీలలో విజయవాడ నగరంలోని ఐలాపురం కన్వేన్షన్ సెంటర్ లో నిర్వహించే ఇంటర్వూలకు విద్యార్ధులు హాజరు కావచ్చన్నారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులు అయిన వారంతా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వూలకు హాజరు కావచ్చన్నారు.

విద్యార్ధుల సౌకర్యార్ధం ఇంటర్వూలు జరిగే సమయంలో సాంకేతిక విద్యాశాఖ నుండి కూడా అధికారులను అందుబాటులో ఉంచుతామని చదలవాడ వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
దేశంలోనే ప్రముఖ సంస్ధగా ఉన్న మేధా సర్వో డ్రైవ్స్ ను సాంకేతిక విద్యాశాఖ అధికారుల బృందం సందర్శించి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్ధులకు అవకాశాలు కల్పించాలని కోరిన నేపధ్యంలో సంస్ధ ఈ ఇంటర్వూలకు నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.